90 వేల నుంచి 59 వేలతో.. జగన్ గెలిచారు అంతే!
ఇక, పార్టీకి ఆయువు పట్టువంటి సీమలో అసలు వైసీపీ నామరూపాలు కూడా లేకుండాపోయింది.
By: Tupaki Desk | 4 Jun 2024 4:39 PM GMTఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఘోరపరాజయాన్నే కాదు.. అత్యంత ఘోర అవమానాన్ని కూడా మిగిల్చాయి. ఆయన పార్టీకి చెందిన అతిరథ మహారథులనదగిన నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వారంతా ఈ ఎన్నికల్లో మట్టికరిచారు. ఇక, కీలక నాయకులు కూడా.. టీడీపీకూటమి సృష్టించిన.. ఓట్ల సునామీలో కొట్టుకుపోయారు. ఇక, పార్టీకి ఆయువు పట్టువంటి సీమలో అసలు వైసీపీ నామరూపాలు కూడా లేకుండాపోయింది.
ఇంత ఘోర పరాజయం ఓవైపు జగన్‌ను వెంటాడుతుంటే.. మరో ఘోర అవమానం కూడా..ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. అదేఆయన గెలిచిన పులివెందులలో దక్కిన మెజారిటీ. 2019లో 90 వేలకు పైగా.. మెజారిటీ దక్కించుకుని రాష్ట్రంలో నెంబర్ వన్ మెజారిటీ దక్కించుకున్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు జగన్. అయితే.. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఇంత కుమించి మెజారిటీ వస్తుందని ఆయన ఆశించారు. ఇదే విషయాన్ని ఆయన సతీమణి కూడా.. చెప్పుకొచ్చారు. కానీ, ఫలితం ప్రారంభమైన తర్వాత.. లీడ్స్ ఒకానొక దశలో జగన్ ను భయ కంపితులను చేశాయనడంలోసందేహం లేదు.
తగ్గడం.. పెరగడంతోలీడ్స్ ఓ ఆట ఆడేసుకున్నాయి. అయితే.. ఎట్టకేలకు 59 వేల మెజారిటీతో జగన్ గట్టెక్కారు. కానీ, గత రెండు ఎన్నికల్లోనూ ఆయన సాధించిన మెజారిటీతో పోల్చుకుంటే.. మాత్రం ఇది అత్యంత నాశిరకం. అంతేకాదు.. అంతకు మించిన అవమానం కూడా అంటున్నారు పరిశీలకులు. జగన్ ఇమేజ్‌తో ఎమ్మెల్యేలు గెలిచారని.. 2019లో చెప్పుకొన్న నాయకులు.. ఇప్పుడు అదే జగన్ కు దారుణమైన మెజారిటీ రావడంతో కిమ్మనడం లేదు. ఇదంతా కూడా.. ప్రభుత్వ వ్యతిరేకతను పట్టి చూపించిందని పలువరు వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా, ప్రస్తుతం జగన్ సాధించిన మెజారిటీ టీడీపీ కి చెందిన 10 మందికి పైగా ఎమ్మెల్యేలు అంతకు మించి సాధించారు. ముఖ్యంగా జగన్ ఓడించాలని పట్టుదలతో పనిచేసిన టీడీపీ యువ నాయకుడు.. నారా లోకేష్‌కు 91 వేలకు పైగా మెజారిటీ లభించింది. ఇక, చంద్రబాబును ఓడించాలని అనుకున్నారు.కానీ, ఆయనకు 47 వేలకుపైగా ఓట్ల మెజారిటీ దక్కింది. ఇలా.. జగన్ కంటే.. చాలా మంది భారీ మెజారిటీ సొంతం చేసుకోవడం గమనార్హం. ఏదేమైనా ఒక్క ఛాన్స్ ను సరిగా నిలబెట్టుకోని ఫలితంగా జగన్ బొక్కబోర్లా పడ్డారని అంటున్నారు పరిశీలకులు.