Begin typing your search above and press return to search.

జగన్ కి వారితో అపాయింట్మెంట్లు లేనట్లేనా ?

ఢిల్లీ ధర్నాతో జగన్ కొత్త చర్చకు తెర తీశారు. ఆయన చేసిన ధర్నాకు ఇండియా కూటమి మిత్రులు హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   26 July 2024 3:00 AM GMT
జగన్ కి వారితో అపాయింట్మెంట్లు లేనట్లేనా ?
X

ఢిల్లీ ధర్నాతో జగన్ కొత్త చర్చకు తెర తీశారు. ఆయన చేసిన ధర్నాకు ఇండియా కూటమి మిత్రులు హాజరయ్యారు. వారంతా జాతీయ స్థాయిలో మోడీని ఘాటుగా విమర్శించారు. దాంతో ధర్నా సక్సెస్ అయిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్న బీజేపీకి జగన్ తాజాగా కొత్త ప్రత్యర్థిగా మారారని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

జగన్ ఢిల్లీలో ధర్నా తరువాత ప్రధాని నరేంద్ర మోడీని హోంమంత్రి అమిత్ షాని రాష్ట్రపతిని కలుస్తారు అని ప్రచారం సాగింది. అయితే ధర్నా తరువాత జగన్ గురువారమే ఏపీకి తిరిగి వచ్చారు. దాంతో జగన్ కేంద్ర పెద్దలతో అపాయింట్మెంట్ కి ప్రయత్నం చేయలేదా లేదా అవతల వైపు నుంచి సుముఖత వ్యక్తం కాలేదా అన్న చర్చ సాగుతోంది.

జగన్ ధర్నాలో పాల్గొన్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ లాంటి వారు నేరుగా ప్రధానిని టార్గెట్ చేశారు. అలాగే జగన్ కి ఇండియా కూటమి అండగా ఉంటుందని శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది వంటి వారు చెప్పారు. అలాగే ఆప్ వంటి పార్టీలు ఈ ధర్నాకు మద్దతు ఇచ్చాయి.

తాము న్యూట్రల్ అని వైసీపీ ఈ ధర్నాతో చెప్పుకోవడానికి లేకుండా పోయింది అని అంటున్నారు. జగన్ ఏ కారణంతో వారిని పిలిచారో దాని వెనకాల వ్యూహాలు ఏమి ఉన్నాయో తెలియదు కానీ ఎన్డీయే కూటమికి వైసీపీ బాహాటంగా దూరం అయినట్లే అని అంటున్నారు.

ఇది గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు జరగలేదు. ఆనాడు జగన్ ఏపీలో చంద్రబాబుని విమర్శించినా ఢిల్లీ స్థాయిలో బీజేపీతో సఖ్యత నెరిపేవారు. అయితే ఆనాడు బాబు మీద ఢిల్లీ బీజేపీ పెద్దలకు అపనమ్మకం కొంత ఉండడంతో పాటు జనసేన ఆనాటి ప్రభుత్వంలో లేకపోవడంతో వైసీపీని కూడా అలా ఎంటర్టైన్ చేశారని ప్రచారం లో ఉంది.

ఇపుడు మాత్రం అలా కాదు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో వైసీపీని వ్యతిరేకిస్తున్నారు. అలాగే చంద్రబాబు టీడీపీ ఎన్డీయేకు ఊతంగా మారింది. దాంతో జగన్ కి అపాయింట్మెంట్లు ఇపుడే కాదు సమీప భవిష్యత్తులోనూ దొరికే అవకాశాలు లేవు అనే అంటున్నారు. ఇక వైసీపీ రాజకీయ అడుగులు ఎటు వైపు అన్నది పక్కన పెడితే ఇండియా కూటమితో కలిసి చేసిన ఈ ధర్నాతో బీజేపీ పెద్దలు మరింత కఠినంగా ఉంటారని అంటున్నారు.

దాంతో ఈ పరిణామాలన్నీ ఆలోచించుకున్న వైసీపీ అధినాయకత్వం అపాయింట్మెంట్లు కోరకుండానే వెనుతిరిగి వచ్చిందా అన్న చర్చ కూడా సాగుతోంది. రానున్న కాలమంతా ఎన్డీయే సర్కార్ నడవాలీ అంటే ఏపీలోని టీడీపీ జనసేన ఎంపీలు అత్యంత కీలకం. ఎపుడైనా చెడితే ఏమో కానీ ఇప్పటప్పట్లో అయితే కూటమిని దాటి బీజేపీ పెద్దలు జగన్ క్ అపాయింట్మెంట్లు ఇచ్చేది లేదని అంటున్నారు.

అంతే కాదు ముందు ముందు ఎన్డీయే నుంచి ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. మొత్తానికి జగన్ ఢిల్లీ యాత్ర తరువాత ఒక విషయం అయితే స్పష్టం అయింది. వైసీపీ ఇండియా కూటమిలో చేరుతుందో లేదో తెలియదు కానీ ఎన్డీయే తో పరోక్ష చెలిమికి సైతం తలుపులు మూసుకుపోయాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఇప్పటప్పట్లో మోడీ అమిత్ షాలతో జగన్ భేటీలు అయితే ఉండకపోవచ్చు అన్నది ఒక క్లారిటీ గా చెబుతున్నారు.