సీబీఐ కోర్టులో సీఎం జగన్ ఫారిన్ ట్రిప్ పిటిషన్ లో ఏముంది?
కీలకమైన ఎన్నికల వేళ.. సీబీఐ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న విదేశీ పర్యటన పిటిషన్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది
By: Tupaki Desk | 9 May 2024 4:51 AM GMTకీలకమైన ఎన్నికల వేళ.. సీబీఐ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న విదేశీ పర్యటన పిటిషన్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత తాను విదేశీ పర్యటన కోసం ముఖ్యమంత్రి పిటిషన్ దాఖలు చేసిన వైనాన్ని సంచలనంగా ఎందుకు చేస్తున్నారు? రోటీన్ గా జరిగే అంశాన్ని బ్రేకింగ్ న్యూస్ కింద ఎందుకు మారుస్తున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇంతకూ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ లో ఉన్న అంశాల్ని చూస్తే.. మే 17 నుంచి జూన్ ఒకటి వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు. ఆదాయానికి మించి ఆస్తులు కోర్టు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల కారణంగా దేశాన్నివిడిచి పెట్టి వెళ్లాలన్నా.. వేరే అంశాలతో దేశం దాటాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే.
ఇదే అంశాన్ని తాజాగా కోర్టుకు తెలిపారు సీఎం జగన్. మే 13న కీలకమైన ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మే 17 నుంచి జూన్ ఒకటి వరకు విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. తాను లండన్.. స్విట్జర్లాండ్.. ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. అంతేకాదు.. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని కోరటం గమనార్హం.
అయితే.. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను ఇప్పుడు మరోలా ప్రచారం చేస్తున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. నిజానికి ప్రతి ఏడాది వేసవిలో విదేశీ పర్యటన చేస్తుంటారు. తన కుమార్తెలను కలిసేందుకు వీలుగా ఫారిన్ ట్రిప్ లకు వెళ్తుంటారు. ప్రతి ఏడాది సమ్మర్ లో రోటీన్ గా పారిన్ కు వెళ్లే ఈ వ్యవహారాన్ని ఎన్నికల వేళ తప్పుడు ప్రచారానికి అనువుగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు మార్చుకుంటున్నారన్న విమర్శ వినిపిస్తోంది.
ఎన్నికల్లో సీఎం జగన్ ఓటమి పాలు అవుతున్నారంటూ విష ప్రచారం చేస్తున్న జగన్ రాజకీయ ప్రత్యర్థులు.. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ పూర్తి అయిన తర్వాత విదేశాలకు వెళుతున్నట్లు వెళ్లిపోయి.. రిజల్ట్ తర్వాత కూడా దేశానికి తిరిగి రారని ప్రచారం చేస్తున్నారు. చూస్తూ.. చూస్తూ.. ఒక అధికార పార్టీ అధినేత కేసుల భయంతో విదేశాల్లో తలదాచుకోవాలన్న ఆలోచన అసలెందుకు చేస్తారు? ఒకవేళఅలా చేస్తే రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుంది కదా? ఈ మాత్రం లాజిక్ లేకుండా ఏ పార్టీ అధినేత అయినా వ్యవహారిస్తారా? అన్నది ప్రశ్న. కానీ.. లాజిక్ ఆలోచించే వరకు వెళ్లకుండా విన్నంతనే.. నిజమే అన్న భావన కలిగేలా ప్రచారం చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక రోటీన్ పిటిషన్ పై మరీ ఇంత రచ్చా? అన్నదిప్పుడు చర్చగా మారింది.