Begin typing your search above and press return to search.

టీడీపీ - వైసీపీ... మధ్యలో కోడెల శివప్రసాద్ ఎపిసోడ్!

అందులో పెట్టిన హ్యాష్ ట్యాగ్ "ఫర్నిచర్ దొంగ జగన్" అని! ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   16 Jun 2024 4:40 AM GMT
టీడీపీ - వైసీపీ... మధ్యలో కోడెల శివప్రసాద్ ఎపిసోడ్!
X

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విషయం శనివారం నుంచి హాట్ టాపిక్ గా మారింది. 2019లో జరిగిన ఒక సంఘటనను గుర్తుకు తెచ్చింది. సమయం అదే, సందర్భం అదే, కారణం అదే కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ లో చేసిన ఒక ట్వీటే ఇందుకు కారణం. అందులో పెట్టిన హ్యాష్ ట్యాగ్ "ఫర్నిచర్ దొంగ జగన్" అని! ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... "తప్పుడు ప్రచారాలు పుట్టేదే ఆ కోళ్ల ఫారం కొంపలో... వ్యక్తిత్వం లేని నీతిమాలిన వ్యక్తి ఎవరో, సొంత తల్లి, సొంత చెల్లి చెప్పారులే కానీ.. ముందు ఇంట్లో పెట్టుకున్న ఫర్నిచర్ ప్రభుత్వానికి ఇవ్వు. మరీ కక్కుర్తి కాకపోతే, నువ్వు ఇంట్లో పడుకునే మంచం, కూర్చునే కుర్చీ కూడా ప్రభుత్వ డబ్బుతో తీసుకోవాలా? ఛీ ఛీ.." అని ట్వీట్ చేసింది టీడీపీ.

ఇదే సమయంలో... "లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్ కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్ తో నింపేసాడు. పదవి ఊడిపోయాక ఆ ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా! అయినా ఇవ్వలేదు" అని మరో ట్వీట్ చేసిన తెలుగుదేశం పార్టీ హ్యాష్ ట్యాగ్ "ఫర్నిచర్ దొంగ జగన్" అని పోస్ట్ చేసింది.

దీంతో... 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ ఎపిసోడ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. నాడు కూడా కోడెలపై ఈ తరహా ఆరోపణలే వచ్చాయని గుర్తుచేస్తున్నారు తమ్ముళ్లు. అప్పట్లో అసెంబ్లీ కోసం సేకరించిన ఫర్నీచర్ ను కోడెల తన ఇంట్లో ఉంచుకున్నాడని ఆరోపిస్తూ... అతనికి "ఫర్నిచర్ దొంగ" అనే ముద్ర వేసింది!

ఈ క్రమంలో కొంతకాలం తర్వాత కోడెల ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఈ వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు... వైసీపీ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఇలా ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోవటం బాధ కలిగిస్తుందని.. ఇలాంటి వేధింపులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అన్నారు. కట్ చేస్తే... జగన్ పై నేడు టీడీపీ ఇవే ఆరోపణలు చేస్తుంది.

ఈ సమయంలో కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం కూడా ఎంట్రీ ఇచ్చారు. గతంలో తన తండ్రిపై అనవసరంగా అభాండాలు వేశారని.. ఇప్పుడు జగన్ పై కూడా కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో... జగన్ పై కోడెల ఆత్మ శాంతించేలా రివేంజ్ గట్టిగానే ఉండేలా ఉందనే కామెంట్లు నెట్టింట వినిపిస్తున్నాయి.

మరోవైపు, టీడీపీ చేస్తున్న విమర్శలపై వైసీపీ రియాక్ట్ అయ్యింది. సిగ్గులేకుండా టీడీపీ నేతలు నీతిమాలిన రాజకీయం చేస్తున్నారని మండిపడుతూ... ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్ జాబితాను ఇప్పటికే జగన్ క్యాంపు కార్యాలయం ప్రభుత్వానికి సమర్పించిందని చెబుతుంది. ప్రభుత్వ జీవోల ప్రకారం ఆయా వస్తువుల రేట్లను అనుసరించి ఖరీదు కట్టాలని అధికారులను కోరినట్లు వివరణ ఇచ్చింది.

ఇలా టీడీపీ తీవ్ర ఆరోపణలు, వైసీపీ ఘాటు రియాక్షన్లు.. మధ్యలో కోడెల శివరాం ఎంట్రీ.. తెరపైకి కోడెల శివప్రసాద్ రివేంజ్ కామెంట్స్... వెరసి ఈ ఫర్నిచర్ వ్యవహారంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడాలి!