Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ చేసిన త‌ప్పుల్లో ఇదే.. పెద్ద త‌ప్పా..!

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత తప్పులు ఏంటి అనేది పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు

By:  Tupaki Desk   |   17 July 2024 2:30 PM GMT
జ‌గ‌న్ చేసిన త‌ప్పుల్లో ఇదే.. పెద్ద త‌ప్పా..!
X

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత తప్పులు ఏంటి అనేది పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు. గడిచిన ఐదు సంవత్సరాలలో పాలన బాగా ఉందని, జగన్మోహన్ రెడ్డి వంటి నాయకుడు రాష్ట్రానికి దొరకడం అదృష్టం అని చెప్పుకొచ్చిన పేర్ని నాని.,.. అదేవిధంగా మరికొందరు నాయకులు కరణం ధర్మశ్రీ వంటి వారు కూడా తప్పులు వెతికే పనిలో పడ్డారు. ఇది మంచి పరిణామం. అయితే పాలనపరంగా ఎట్లాంటి తప్పులు చేశారు అనేది ఒకవైపు అధికారంలోకి వచ్చిన టిడిపి చెపుతూ వస్తుంది. వీటిని ఇప్పుడు సరిదిద్దుకున్నా ప్రయోజనం అయితే లేదు.

ప్రధానంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టాల్సింది కేడర్ పైన. ఇదే విషయాన్ని పేర్ని నాని, కరణం ధర్మశ్రీ చెప్పుకొచ్చారు. అధికారంలో ఉండగా పార్టీ కేడర్‌ను పూర్తిగా పక్కన పెట్టడం జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు అని నాని వ్యాఖ్యానించారు. కేవలం వాలంటీర్లను మాత్రమే నమ్ముకోవడం వాలంటీర్ల ద్వారానే అన్ని పనులు చేయించడం తద్వారా ప్రజలకు కార్యకర్తలకు పార్టీ నాయకులకు కూడా సున్నితమైన సంబంధం తెగిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజానికి ఈ విషయాన్ని రెండు సంవత్సరాల కిందటే కొందరు నాయకులు చెప్పుకొచ్చారు. అన్నీ వాలంటీర్లు అయితే మేమెందుకు అంటూ కీలక నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించారు. అయితే అప్పట్లో వారి మాటలను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. అదే విధంగా కీల‌క స్థాయి నాయకులు కూడా పెద్దగా స్పందించలేదు. కానీ ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ ఘోరంగా విఫలం కావడం పార్టీకి అందువస్తారు అనుకున్న వాలంటీర్లు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన బలమైన హామీతో వైసీపీకి దూరం కావడం తెలిసిందే.

అదే సమయంలో వాలంటీర్ల స్థానాన్ని భర్తీ చేయాల్సిన కార్యకర్తలు జండా మోసే నాయకులు కూడా నిర్లిప్తంగా వ్యవహరించడం వంటివి వైసిపికి బాగా ఇబ్బందికర పరిణామంగా మారాయి. మరి ఇప్పటికైనా గ్రహించారు కాబట్టి మున్ముందు పార్టీ కేడర్ను బలోపేతం చేసే విషయంలో వైసిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏ విధమైన వ్యూహంతో ముందుకు సాగుతుంది అనేది చూడాలి. ఏదేమైనా అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలను కేడర్ను వదులుకోవడం ఎంత ప్రమాదకరమో వైసిపి విషయానికి గమనిస్తే స్పష్టంగా అర్థం అవుతుంది.

ఇదే విషయాన్ని టిడిపి అధినేత చంద్రబాబు అధికారం చేపట్టిన నాలుగైదు రోజుల్లోనే చెప్పుకొచ్చారు పార్టీ క్యాడర్కు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా కీలక నాయకులు వ్యవహరించాలని ఆయన సూచించారు. తాను కూడా ప్రతి నెల ఒకసారి కచ్చితంగా పార్టీ కేడర్ తో సమావేశం అవుతాన‌ని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్‌ను సముదాయించడం, పార్టీతో మమేకం కావడం, వారి కష్టాలు కూడా పరిష్కరించే ప్రయత్నం చేయటం వంటివి ముందున్న ప్రధాన అంశాలు. మరి ఏం చేస్తారో చూడాలి.