మోడీ...జగన్... అసలు ఏమి జరుగుతోంది...!?
అదే విధంగా టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారాన్ని చిలకలూరిపేటలో ప్రారంభించిన నరేంద్ర మోడీ జగన్ మీద విమర్శలు చేయకుండానే వెళ్ళిపోయారు
By: Tupaki Desk | 28 March 2024 8:30 AM GMTమోడీ దేశానికి ప్రధాని. జగన్ ఏపీకి ముఖ్యమంత్రి. ఈ ఇద్దరి మధ్య ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సారధులుగా ఉన్న సంబంధ బాధవ్యాలే తప్ప అంతకు మించి ఏమీ లేదు అని రెండు పార్టీల నేతలూ చెబుతూ ఉంటారు. కానీ చూడబోతే అంతకు మించి బంధమే ఉందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే రాజకీయాలు ముదిగి పాకాన పడి ఎన్నికల వేడి పుట్టుకుని వచ్చాక మోడీ పార్టీ అయిన బీజేపీ కూటమిలో ఉంటూ ప్రత్యర్ధిగా ఎదురు వచ్చినా సీఎం జగన్ ఒక్క మాట అనడంలేదు
అదే విధంగా టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారాన్ని చిలకలూరిపేటలో ప్రారంభించిన నరేంద్ర మోడీ జగన్ మీద విమర్శలు చేయకుండానే వెళ్ళిపోయారు. జగన్ మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అని ఒక ఆరోపణ చేశారు. వైసీపీ కాంగ్రెస్ రెండూ ఒక్కటే అంటూ మరో కొత్త ఆరోపణ చేశారు. ఈ రెండూ కూడా టీడీపీని జనసేనను సంతోషపెట్టలేకపోయాయి.
నిజానికి చూస్తే మోడీ తీవ్ర స్థాయిలో ప్రత్యర్ధుల మీద విమర్శలు చేస్తారు. జగన్ మీద అన్ని రాజకీయ పార్టీలు చేసే ఆరోపణలే మోడీ చేస్తే వాటి పవర్ వేరుగా ఉంటుందని కూడా అంటారు. జగన్ మీద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కేసులు కోర్టులలో నడుస్తున్నాయి. ఆలాగే ఆయన ఇంట్లో సొంత చిన్నాన్న వివేకా దారుణ హత్య మిస్టరీగా ఉంది. దాని మీద కడప ఎంపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటి మీద కనుక మోడీ ఆరోపణలు చేస్తే వాటికి విలువ ఉండేదని, జగన్ కచ్చితంగా ఇరుకున పడేవారు అని అంటారు. కానీ మోడీ అలా చేయకుండానే సభను ముగించారు.
ఇక జగన్ విషయానికి వస్తే మేమంతా సిద్ధం పేరుతో ఆయన బస్సు యాత్రను ఏపీలో స్టార్ట్ చేశారు. ఆయన తొలి సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగం అంతా చంద్రబాబు మీదనే ఉంది. ఆయననే టార్గెట్ చేశారు. బాబు రాజకీయాలు నీచంగా చేస్తున్నారు అని విరుచుకుపడ్డారు. అంతా కలసి తన మీదకు దండెత్తి వస్తున్నారు అని అన్నారే తప్ప ఆ కూటమిలో ఉన్న బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. జనసేన పేరు ప్రస్తావించకపోయినప్పటికీ దత్తపుత్రుడు అని పవన్ ని టార్గెట్ చేశారు.
మరి బీజేపీ పొత్తులో ఉంది కదా ఏపీకి విభజన హామీలు అమలు చేయలేదు కదా, ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా ఏపీకి స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వలేదు కదా పోలవరం పూర్తి చేయలేక పోయింది. రాజధానికి నిధులు ఇచ్చి నిర్మించలేక పోయింది ఇలా చాలా ఉన్నాయి. మరి మోడీ ప్రభుత్వం మీద జగన్ ఎందుకు విమర్శలు చేయలేదు అన్న చర్చ సాగుతోంది.
ఇక కంటికి కనిపిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తోంది బీజేపీ, కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. ఇలా చూస్తే కనుక బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఏమీ చేయలేదు. గట్టిగా మాట్లాడితే కేంద్రాన్ని ఎన్ని అయినా అనవచ్చు. కానీ జగన్ ఎక్కడా మోడీ పేరు ఎత్తలేదు, ఆయన ఊసు తలవలేదు తన స్పీచ్ మొత్తం చంద్రబాబు చుట్టూ తిప్పేశారు.
దీని మీదనే ఇపుడు చర్చ సాగుతోంది. మోడీ చూస్తే ఏపీలో జగన్ మీద ఏ విధంగా విమర్శలు చేయలేదు. డిటో అన్నట్లుగా జగన్ కూడా మోడీని ఏమీ అనడంలేదు. అసలు ఏమి జరుగుతోంది అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ వైరం ఉంది. ప్రత్యర్ధులుగా ఉంటూ ఎన్నికల సమరంలో పాలు పంచుకుంటున్నారు. కానీ కూటమికి పెద్దన్న మోడీని జగన్ విమర్శించడంలేదు. ఏపీలో ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు నడిపిన వైసీపీ అధినేత జగన్ గురించి మోడీ అనడం లేదు. దీంతోనే ఏదో జరుగుతోంది తెర వెనక అన్నది మాత్రం అందరిలో అనుమానాలుగా ఉన్నాయని అంటున్నారు.
అయితే మోడీతో పెట్టుకున్న వారికి ఏమి జరుగుతుందో అందరికీ తెలుసు. కేజ్రీవాల్ ఇటీవల అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. అలాగే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది.బలమైన ప్రభుత్వం కేంద్రంలో ఉండబోతోంది. అందుకే ఎందుకొచ్చింది అనే జగన్ బీజేపీ జోలికి పోవడం లేదు అని అంటున్నారు. ఏపీలో చూస్తే బీజేపీ కూడా ఏమీ లేకపోవడం వల్ల కూడా ఆయన ఆ పార్టీని టార్గెట్ చేయడం లేదు అంటున్నారు. ఇక మోడీ కూడా ఏపీలో పాతిక సీట్లూ బీజేపీ వైపు ఉండేలా చూసుకోవడం కోసమే జగన్ గురించి పెద్దగా విమర్శలు చేయడంలేదు అని అంటున్నారు.