Begin typing your search above and press return to search.

బీజేపీతో వైసీపీ...సెట్ అయిన వ్యవహారం

బీజేపీతో వైసీపీ బంధం వికసిస్తోందా అంటే రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనించాల్సిందే

By:  Tupaki Desk   |   23 July 2024 3:00 AM GMT
బీజేపీతో వైసీపీ...సెట్ అయిన వ్యవహారం
X

బీజేపీతో వైసీపీ బంధం వికసిస్తోందా అంటే రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనించాల్సిందే. కోరి మరీ వైసీపీ బీజేపీకి మద్దతుగా నిలుస్తామని అంటే బీజేపీ ఎందుకు నో చెబుతుంది అన్నది లాజిక్ కి అందని ప్రశ్న. ఇక బీజేపీకి కేంద్రంలో రాజకీయ సంకటాలు చాలానే ఉన్నాయి.

అలాగే ఏపీలో ఏమీ కాకుండా పోయిన వైసీపీకి ఒక ఆసరా కావాల్సి ఉంది. మరి పరస్పరమైన ఆధారాలు కలిస్తే అందులో విశేషం ఏమి ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మూడూ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే కేంద్రంలో చూస్తే బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు ఉన్నారు.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు వైసీపీకి చోటెక్కడిది అన్న డౌట్లు రావచ్చు. రాజకీయాల్లో చోటు ఉండదు, వెతుక్కోవాల్సిందే. ఇపుడు అలాంటి పనిలో వైసీపీ బిజీగా ఉంది అని ఢిల్లీ వార్తలు చెబుతున్నాయి. తాజాగా పార్లమెంట్ చాంబర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి కలిశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఎంపీ స్వయంగా వెల్లడించారు. గవర్నెన్స్ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అనేక విషయాలను అమిత్ షాతో చర్చించినట్లుగా విజయసాయిరెడ్డి తెలిపారు.

అయితే దానితో పాటుగా ఇంకా చాలానే చర్చించి ఉంటారని అంటున్నారు. అవేంటి అంటే తన మీద వచ్చిన ఆరోపణలకు ఆయన అమిత్ షాకు వివరణ ఇచ్చారని అంటున్నారు. అంతే కాదు రాజ్యసభలో బీజేపీకి మద్దతు తక్కువగా ఉంది. దంతో వైసీపీకి చెందిన 11 మంది ఎంపీలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని చెప్పి ఉంటారని అంటున్నారు.

ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పాయని ఆరోపిస్తూ ఆయన ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రధాని మోడీని కలుస్తామని ఇప్పటికే జగన్ ప్రకటించారు.

దాంతో జగన్ వచ్చి కలుస్తారు అన్న సందేశాన్ని అమిత్ షాకు విజయసాయిరెడ్డి వినిపించి ఉంటారు అని అంటున్నారు. అంతే కాదు 2019 నుంచి 2024 మధ్యలో అయిదేళ్ల పాటు అవుట్ రేట్ గా వైసీపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రతీ అంశంలోనూ మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా అమిత్ షాకు విజయ్ సాయిరెడ్డి గుర్తు చేసి ఉంటారని అంటున్నారు.

ఇక విజయ్ సాయిరెడ్డి చెప్పిన ప్రతీ విషయాన్ని విన్న అమిత్ షా అంతా మాకు తెలుసు అని అన్నట్లుగా కూడా ఢిల్లీ వర్గాల భోగట్టా. ఇక విజయసాయిరెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే బీజేపీ భవిష్యత్తు రాజకీయాలను సైతం దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తోంది అని అంటున్నారు.

ఒకరికి ఒకరు దన్నుగా చేస్తూ ఏపీ రాజకీయాన్ని బ్యాలెన్స్ చేసేలా బీజేపీ 2014 నుంచి ఆడుతున్న ఆటనే మళ్లీ రిపీట్ చేయబోతోందా అన్న చర్చ కూడా వస్తోంది. అదే టైం లో బీజేపీకి అయిదేళ్ల పదవీ కాలం కేంద్రంలో చాలా ముఖ్యం. దాంతో సింగిల్ ఎంపీ ఉన్నా కూడా ఆ పార్టీకి కావాల్సిందే. ఆయాచితంగా వైసీపీ మద్దతు ఇస్తామంటే బీజేపీ ఎందుకు తీసుకోదు అన్న చర్చ కూడా వస్తోంది.

మొత్తం మీద చూస్తే బీజేపీతో టైయప్ కి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ విషయంలో చూస్తే బీజేపీ వైసీపీకి తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లుగానే కనిపిస్తోంది. బీజేపీ ఢక్కామెక్కీలు తిన్న పార్టీ. ఎవరు ఆధిపత్యం ప్రదర్శించకుండా ఎవరూ ఏపీలో ఏపక్షంగా మారకుండా చూసుకుంటూ అన్ని వైపుల నుంచి మద్దతు తనకే ఉండేలా చేసుకోవడంలోనే సక్సెస్ అవుతుంది అని అంటున్నారు.

దాంతో బీజేపీ వైసీపీని వ్యూహాత్మకంగానే దగ్గరకు తీయవచ్చు అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా బీజేపీతో మేము ఉన్నామని చెప్పుకుంటే ఏపీలో వైసీపీకి కాస్తా ఊపిరి పీల్చుకునే వీలు ఉంటుంది. దాంతోనే బీజేపీ అగ్ర నేత కేంద్ర మంత్రి అమిత్ షాతో విజయ్ సాయిరెడ్డి భేటీ అయ్యారు అని అంటున్నారు.