Begin typing your search above and press return to search.

జగన్ టీం లో నోరున్న వారేరీ ?

జగన్ టీం అంటే చాలా పెద్దది. 2014లో 67 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో నోరున్న గొంతులు చాలా ఎక్కువగా ఉండేవి

By:  Tupaki   |   4 Jun 2024 7:29 PM GMT
జగన్ టీం లో నోరున్న వారేరీ ?
X

జగన్ టీం అంటే చాలా పెద్దది. 2014లో 67 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో నోరున్న గొంతులు చాలా ఎక్కువగా ఉండేవి. వారంతా అసెంబ్లీలో అధికార టీడీపీని ధీటుగా ఎదుర్కొనేవారు. అలా జగన్ కి శ్రమ లేకుండా చేశారు. ఇక 2019లో అయితే ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు జగన్ సైన్యంగా ఉండేవారు. సభ అంతా వారే కనిపించేవారు. చాలా బిగ్ షాట్స్ బిగ్ సౌండ్స్ ఉండేవి.

సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి పెద్ద గొంతుకలు చాలా కావాలి. అధికార పక్షం ఎంతసేపూ బుల్డోజ్ చేసుకుంటూ పోతుంది. అలాంటి టైం లో స్పీకర్ పోడియం వరకూ వెళ్లాలి. సభలో నిరసనలు ఉంటాయి. చర్చల సందర్భంగా ఆవేశ కావేశాలు ఉంటాయి.

ఇవన్నీ రక్తి కట్టించాలంటే ముందు ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఒకవేళ తగ్గినా ధాటీగా అధికార పక్షం మీద విరుచుకు పడే వారు కావాలి. కానీ ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే తీరు చూస్తే చాలా చిన్న టీం గా చెప్పుకోవాలి.

కేవలం పదకొండు మంది మాత్రమే వైసీపీ తరఫున గెలిచారు. వీరంగా టీడీపీ కూటమి సృష్టించిన సునామీ నుంచి బయటకు వచ్చిన వారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నా ఉప నేతలు ఉండాలి. సభలో అంశాల మీద మాట్లాడాలి. ఇక వైసీపీ నుంచి గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల లిస్ట్ చూస్తే వైఎస్ జగన్ (పులివెందుల) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), దాసరి సుధ ( బద్వేల్ ), వై బాలనాగిరెడ్డి (మంత్రాలయం), బూసినే విరూపాక్షి ( అలూరు), శివప్రసాదరెడ్డి (దర్శి), తాటిపర్తి చంద్రశేఖర్ ( ఎర్రగొండపాలెం), రేగం మత్స్య లింగం ( అరకు), మత్స్యరాస విశ్వేశ్వరరాజు ( పాడేరు ), ఆకేపాటి అమరనాధరెడ్డి (రాజంపేట), పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి (తంబళ్ళపల్లి).

వీరిలో ఎవరు అధికార పక్షం మీద ధీటుగా విమర్శలు చేసి సభలో నెగ్గుకుని వస్తారు అన్నదే చర్చకు వస్తున్న విషయం. జగన్ ఎటూ పోరాడతారు.ఆయన తరువాత మరి కొందరు కూడా ఉండాలి కదా. అయితే ఇందులో మిగిలిన వారు కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ టీం లో ముగ్గురు కొత్తగా సభకు వచ్చిన వారు కావడంతో వారికి కూడా ట్రైనింగ్ ఇప్పించి బాహుబలి లాంటి అధికార పక్షం మీద పోరాటం చేసేలా చూడాల్సి ఉంది.