చంద్రబాబులో భయం కనిపిస్తోంది: జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబులో భయం కనిపిస్తోందని, మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 22 July 2024 6:00 PM GMTఏపీ సీఎం చంద్రబాబులో భయం కనిపిస్తోందని, మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభు త్వం ఏర్పడి 50 రోజులు అయినప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్క కీలక నిర్ణయమూ తీసుకోలేదన్నారు. దీనిని బట్టి చంద్రబాబు అడుగు వేయాలంటేనే భయపడుతున్నట్టు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. 50 రోజుల కూటమి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గాలు పోటెత్తాయని, హత్యారాజకీయాలు జరుగుతున్నాయని జగన్ పేర్కొన్నారు. ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరే కత స్టార్టయిందని చెప్పారు. అందుకే చంద్రబాబు భయంతో అల్లాడిపోతున్నట్టు చెప్పారు.
రాష్ట్ర పాలనకు ప్రతీక వంటి బడ్జెట్ను ప్రవేశ పెట్టేందుకు కూడా చంద్రబాబు సర్కారు భయపడుతోందని జగన్ అన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశ పెడితే.. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుందని.. అందుకే చంద్రబాబు కేవలం 7 మాసాలకు(ఆగస్టు-మార్చి) ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిలో చంద్రబాబు భయపడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు.
సంక్షేమ పథకాలను నిలిపివేసి.. ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ``హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. వీటన్నింటి ద్వారా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడ దు అన్న పరిస్థితి సృష్టిస్తున్నారు`` అని వైసీపీ అధినేత విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు!
తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే.. ఎక్కడ ప్రశ్నిస్తామోనని చంద్రబాబు భయపడుతున్నారని.. అందుకే తమకు విపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రస్తుతం అధికార, విపక్షాలు మాత్రమే ఉన్నాయని.. అయినా.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని.. దీనిని బట్టి చంద్రబాబు ఎంత భయపడుతున్నారో అర్థమవుతుందన్నారు. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం పట్టుకుందన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే.. అసెంబ్లీలో తప్పకుండా మైకు ఇవ్వాల్సి ఉంటుందని.. అప్పుడు ప్రజల సమస్యలపై తాము గళం వినిపిస్తామని.. ఇది ఇష్టం లేకే చంద్రబాబు తమకు విపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
అందుకే ఢిల్లీకి
రాష్ట్రంలో గడిచిన 50 రోజులుగా జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని దేశ రాజధానిలో తెలిపేందుకే తాము ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్టు జగన్ చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని నొక్కి చెబుతామన్నారు. తమకు కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని పోతామన్నారు.