Begin typing your search above and press return to search.

చంద్రబాబు కాంగ్రెస్ బంధం పై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో అధికారంలో టీడీపీ బీజేపీ జనసేన ఉన్నాయి. ఇవన్నీ ఎన్డీయే కూటమి భాగస్వాములు.

By:  Tupaki Desk   |   26 July 2024 12:45 PM GMT
చంద్రబాబు కాంగ్రెస్ బంధం పై జగన్ సంచలన వ్యాఖ్యలు
X

ఏపీలో అధికారంలో టీడీపీ బీజేపీ జనసేన ఉన్నాయి. ఇవన్నీ ఎన్డీయే కూటమి భాగస్వాములు. మరో వైపు జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు అన్నీ ఇండియా కూటమిలో భాగస్వాములు. ఆ విధంగా చూస్తే కాంగ్రెస్ కి టీడీపీ బద్ధ రాజకీయ వ్యతిరేకిగా ఉండాల్సి ఉంది.

అదే రాజకీయ లెక్క కూడా. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం కాంగ్రెస్ తో చంద్రబాబు కాంట్రాక్ట్ మెయింటెయిన్ చేస్తున్నారు అని సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పెద్దలతో బాబు రిలేషన్స్ ని కొనసాగిస్తున్నారు అని ఆరోపించారు.

అంతే కాదు రాహుల్ గాంధీ మీద సైతం పరోక్షంగా కామెంట్స్ చేశారు. మణిపూర్ లో అల్లర్లు జరిగితే దాని మీద మాట్లాడే వారు ఏపీలో రాజకీయ దమనకాండ మీద ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. తమను అనుకూలంగా ఉన్న వారి రాష్ట్రాలలో ఏమి జరిగిన పట్టించుకోరా అని ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకి కాంగ్రెస్ కి ఉన్న బంధం ఏమిటి అన్నది కూడా తెలియాలని ఆయన అన్నారు.

ఈ విషయాలు అన్నీ కాంగ్రెస్ పార్టీ పెద్దలనే అడగాలని ఆయన మీడియాను కోరారు. తాము ఢిల్లీలో ధర్నా చేసినపుడు అన్ని పార్టీలను పిలిచామని అందులో బీజేపీ కాంగ్రెస్ కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే కాంగ్రెస్ నేతలు ఎందుకు తమ ధర్నాకు వచ్చి మద్దతు ఇవ్వలేదు అన్నది వారినే అడగాలి తప్ప తమను కాదని అన్నారు. జగన్ ఈ రకమైన సమాధానం చెప్పడం ద్వారా రెండు విషయాలలో క్లారిటీ ఇచ్చారు.

ఒకటి కాంగ్రెస్ ని తాను పిలిచినా రాలేదు అని ఆ పార్టీకి తమతో రాజకీయ విభేదాలు అలాగే ఉన్నాయని చెప్పడం ఒకటైతే తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ సన్నిహితంగా ఉంటూ పరోక్షంగా సహాయం చేస్తోంది అన్నది మరో విషయంగా చెప్పారు. అంటే జగన్ ఆరోపణలు కాస్తా సంచలనం గానే ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేతో అధికారం పంచుకుంటూ కూడా బాబు కాంగ్రెస్ తో అదే టైం లో క్లోజ్ రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు అని ప్రధాన ఆరోపణ జగన్ చేసారు.

ఇది నిజంగా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ పెద్దలకు బాంబు లాంటి వార్త అనే చెప్పాలి. కేవలం టీడీపీ జేడీయూ మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉంటోంది. అలాంటిది జగన్ చేసిన ఆరోపణలు చూస్తే రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పెద్దలు బాబు టచ్ లో ఉంటున్నారు అంటే కనుక అలాంటి ఆరోపణల మీద అలెర్ట్ కావాల్సింది ఎన్డీయే పెద్దలే అని అంటున్నారు.

బహుశా అలా అలెర్ట్ కావాలని బాబుతో గ్యాప్ పెరగాలని కూడా భావించి జగన్ ఈ తరహా కామెంట్స్ చేసి ఉంటారా అన్న చర్చ కూడా వస్తోంది. ఈ రోజుకు అయితే కేంద్ర బీజేపీ పెద్దలు బాబుని నమ్మకమైన నేస్తంగానే చూస్తున్నారు. అయితే అలా చూడడానికి లేదని చెప్పడమే జగన్ ఆరోపణల వెనక ఉన్న వ్యూహమా అని కూడా ఆలోచించాల్సి ఉంది.

అంతే కాదు బీజేపీ ని కాంగ్రెస్ ని ఇద్దరినీ తన ధర్నాకు పిలిచాను అని జగన్ చెప్పారు. అంటే తాను న్యూట్రల్ విధానమే ఈ రోజుకీ కొనసాగిస్తున్నాను అని చెప్పడం కూడా ఆయన ఉద్దేశ్యమా అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీని ధర్నాకి పిలవడం ద్వారా జగన్ ఆ పార్టీతో పాత వైరాన్ని పక్కన పెట్టాలనుకున్నారు అన్నది కూడా అర్ధం అవుతోంది.

మరి కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు రాలేదు అన్నది చూస్తే జగన్ చెప్పిన మాటలే నిజమా లేక కాంగ్రెస్ కి ఏపీలో బలపడేందుకు వేరే ఆలోచనలు ఉన్నాయా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తు ఉంది. కాంగ్రెస్ కి తానుగా ఏపీలో అధికారంలోకి రావాలని ఉంది అని అంటున్నారు. దానికి వైసీపీ అడ్డంకి గా భావిస్తే మాత్రం ఆ పార్టీతో కలవదు అన్నదే రాజకీయ సూత్రంగా చెబుతున్నారు.