జగన్ ఫేస్ చేయాల్సిందే...తప్పదు !
వైసీపీ అధినేత జగన్ ప్రజల్లోకి వెళ్తాను అని అంటున్నారు. అయితే అది మరీ తొందర అవుతుంది అన్న మాట కూడా ఉంది
By: Tupaki Desk | 30 Jun 2024 12:30 AM GMTవైసీపీ అధినేత జగన్ ప్రజల్లోకి వెళ్తాను అని అంటున్నారు. అయితే అది మరీ తొందర అవుతుంది అన్న మాట కూడా ఉంది. ప్రజలు కొత్త ప్రభుత్వానికి అనుకూలంగా ఒటేశారు. ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అన్నది వారు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. తమకు మేలు జరుగుతుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆశలు నిరాశగా మారిన నాడే వారు వేరే వైపు చూస్తారు.
కనీసంగా ఏడాది వరకూ అయితే కొత్త మోజు జనాల్లో ఉంటుందని అంటున్నారు. అందువల్ల జగన్ ఇప్పటికిప్పుడు ప్రజలలోకి వెళ్ళినా ఉపయోగం ఏమీ ఉండదని అంటున్నారు పైగా జనాల్లోకి వెళ్లాలంటే ఒక ఇష్యూ ఉండాలి. అలాగే నాయకుని పట్ల ఆకర్షణ కూడా పెరగాలి. ఈ రెండింటికీ టైం పడుతుంది. జగన్ ఎన్నికల ప్రచారం పేరుతో ఊరూరా తిరిగి జనాలను కలసి వచ్చారు.
జగన్ స్పీచులన్నీ ఇంకా చెవుల్లో రింగు రింగు మంటున్నాయి. ఈ క్రమంలో ఆయన మళ్లీ వచ్చి జనాలను కలవాలనుకున్నా రొటీన్ వ్యవహారంగానే ఉంటుంది. ఏటిలో పడవ గాలి వాటం చూసి ముందుకు కదిలితేనే వేగంగా గమ్యానికి చేరుతుంది రాజకీయాల్లో కూడా టైం రావాలి. ఇపుడు జగన్ జనంలోకి వెళ్ళి చేసేది లేదు అన్నది సొంత పార్టీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులలోనూ వినిపిస్తోంది.
అయితే ప్రజల వద్దకు వెళ్లడం అన్నది అతి పెద్ద అస్త్రం దానిని ముందే ఉపయోగించుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉండదు. వ్యూహాత్మకంగానే వాడాలి. కనీసం ఏడాది పాలన చూసిన తరువాత నెమ్మదిగా జనంలోకి వెళ్లి ఆ తరువాత దూకుడుగా ముందుకు సాగవచ్చు. అలా చివరి రెండేళ్లకు వచ్చేసరికి అది పీక్స్ కి వెళ్లేలా చూసుకోవచ్చు.
మరి ఈ ఏడాది రెండేళ్ల కాలం ఏమి చేయాలనీ అంటే జనం వద్దకు వెళ్లకుండా మీడియా ద్వారా వారితో డైలీ కనెక్షన్ పెట్టుకోవచ్చు అని అంటున్నారు. మీడియా ప్రజలకు పార్టీలకు మధ్య వారధి. అందువల్ల మీడియా ద్వారానే వైసీపీ రీచార్జి కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మీడియాతో తరచూ ఇంటరాక్ట్ అవుతూ జగన్ జనం నాడిని పట్టుకునే ప్రయత్నం చేయాలి అని అంటున్నారు.
చంద్రబాబు కూడా గతంలో అదే చేసేవారు అని గుర్తు చేస్తున్నారు. మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ పార్టీ వాయిస్ ని వినిపిస్తూ పోతేనే తప్ప టీడీపీ కూటమి స్పీడ్ ని తట్టుకోలేరని అంటున్నారు. జగన్ అయితే మీడియాకు కడు దూరంగా ఉంటారు అని అంటారు. ఆయన సీఎం గా ఉండగా అయిదేళ్ల పాటు కూడా మీడియాను ఎక్కడా ఫేస్ చేయలేదు అని గుర్తు చేస్తున్నారు. దాని వల్లనే దారుణమైన ఫలితాలను తాజా ఎన్నికల్లో పొందాల్సి వచ్చింది అని కూడా విశ్లేషిస్తున్నారు.
అయితే అధికారంలో ఉన్నపుడు వేరు. కధ సాఫీగానే సాగిపోతుంది. మీడియాలో కనిపించకపోయినా అధికార ఆర్భాటం ఉంటుంది. మంత్రులు మాట్లాడుతూంటారు. ప్రజల ఫోకస్ ఎటూ ప్రభుత్వం మీద అలాగే పార్టీ మీద ఉంటుంది. ఇపుడు అలా కాదు ప్రజలు వైసీపీ వైపు చూడాలన్నా కనీసం మాట్లాడుకోవాలన్నా కూడా జగన్ తరచూ కనిపించాలని అంటున్నారు.
జగన్ మీడియాతో రెగ్యులర్ గా ఇంటరాక్ట్ కావాల్సిందే అని సూచిస్తున్నారు. పైగా టీడీపీ కూటమి అనేక రకాలైన అవినీతి కార్యక్రమాలు కుంభకోణాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని ఒకటే విమర్శలు చేస్తోంది. వైసీపీని పూర్తి స్థాయిలో బదనాం చేయడానికి చూస్తోంది. పోలవరం విషయంలో శ్వేతపత్రం రిలీజ్ చేసిన సందర్భంగా పాపాల భైరవుడు జగనే అని చంద్రబాబు తేల్చేశారు.దాని కంటే ముందు పోలవరం సందర్శనలోనూ పోలవరానికి శాపం జగన్ అని తీవ్ర విమర్శలు చేశారు.
ఈ రెండు సందర్భాలలో కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబే బాబుకు కౌంటర్ ఇచ్చారు. అయితే సీఎం హోదాలో ఉన్న బాబుకు జవాబు చెప్పాలీ అంటే సీఎం గా పనిచేసిన జగనే సరిపోతారు అని అంటున్నారు. పోలవరం విషయంలో వైసీపీ ఏమి చేసింది, ఏమి చేయలేదు, తమ అయిదేళ్ళ పాలనలో ఎంత ఖర్చు చేశాం, ఎంత పురోగతి సాధించామన్నది వైసీపీ కనీసం కౌంటర్ గానైనా చెప్పకపోతే జనాల ముందు వైసీపీ దోషిగా ఉండాల్సి వస్తుందని అంటున్నారు.
ఇక రేషన్ కుంభకోణం అని మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నారు దాని మీద పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖల విషయంలో రానున్న రోజులలో శ్వెత పత్రం రిలీజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపధ్యంలో చూస్తే కనుక జగన్ మీడియా ముందుకు వచ్చి వైసీపీ వాదనను గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
అదే విధంగా ప్రభుత్వం ప్రతీ రోజూ వైసీపీ మీద అఫెన్సివ్ మోడ్ లో వెళ్తోంది. కనీసం డిఫెన్స్ చేసుకోవడానికి అయినా జగన్ మీడియా ముందుకు రావాలని అంటున్నారు. ఓటమి తప్పు కాదు, కానీ ఓటమి తరువాత తీసుకునే యక్షన్ సరిగ్గా లేకపోతేనే తప్పు అని అంటున్నారు.
వైసీపీ ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రభుత్వంగా ఫెయిల్ అని జగన్ రాజకీయాలకు పనికిరాడు అని నిరూపించే ప్రయత్నం అధికార కూటమి చేస్తోంది. అయినా సైలెంట్ గా ఉంటే మాత్రం ఆ తరువాత ఎపుడు జనంలోకి వెళ్ళినా ఉపయోగం ఏమీ ఉండదనే అంటున్నారు. రాజకీయాలు చేసేటపుడు అందరూ నడిచే దారిలోనే వెళ్లాలి. తప్ప తాము సెపరేట్ అని అనుకుంటే దారుణమైన ఫలితాలే వైసీపీకి వస్తాయని అంటున్నారు.