Begin typing your search above and press return to search.

జగన్ ని జనాలు మిస్ అవుతున్నారా ?

ఏపీలో ఎన్నికలు ముగిసి మూడు నెలలు దగ్గర అవుతోంది. ఫలితాలు వచ్చి రెండు నెలలు పై దాటింది

By:  Tupaki Desk   |   8 Aug 2024 9:59 AM GMT
జగన్ ని జనాలు మిస్ అవుతున్నారా ?
X

ఏపీలో ఎన్నికలు ముగిసి మూడు నెలలు దగ్గర అవుతోంది. ఫలితాలు వచ్చి రెండు నెలలు పై దాటింది. కొత్త ప్రభుత్వంగా టీడీపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టి రెండు నెలలు పూర్తి అవుతున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. ఇప్పటికి ఏడు శ్వేతపత్రాలు వివిధ శాఖల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు రిలీజ్ చేశారు.

ఏపీలో ఆర్థిక పరిస్థితి బాలేదని మొత్తం వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని బాబు దాదాపుగా ప్రతీ రోజూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే విపక్షంలో వైసీపీ ఉంది. ఆ పార్టీ ఎక్కువగా తమ నేతల మీద జరుగుతున్న దాడులను హైలెట్ చేస్తోంది. లా అండ్ ఆర్డర్ ఏపీలో దెబ్బ తిన్నదని తీవ్ర ఆరోపణలు చేస్తోంది. జగన్ నెమ్మదిగా జనంలోకి వస్తున్నారు. అలాగే మీడియాను ఫేస్ చేస్తున్నారు.

పార్టీ నేతలతో మీటింగ్స్ పెడుతున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్ జనంతో అయితే మమేకం కావాలని అనుకుంటున్నారు కానీ ప్రస్తుతానికి కొంత సమయం కొత్త ప్రభుత్వానికి ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం మీద ప్రజల ఆశలు ఎలా ఉన్నాయి. ఓడి విపక్షంలోకి వచ్చిన వైసీపీ మీద ఎలాంటి భావనలు ఉన్నాయంటే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

ఇక ఓడి మాజీ సీఎం అయిన జగన్ ని జనాలు మిస్ అవుతున్నారా అంటే దిగువ తరగతి వాళ్ళు చాలా మిస్ అవుతున్నారని అంటున్నారు. ఉదాహరణకు చూస్తే 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఒక సాధారణ కుటుంబంలో ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటే వారికి కనీసంగా ఒక ఏడాదిలో ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద లక్ష రూపాయలకు తగ్గకుండా నగదు వచ్చేదంట.

అది ఎలా అంటే ఒక ఆటో డ్రైవర్ ఉంటే వాహన మిత్ర, భార్య టైలర్ అయితే ఆమెకు ఆ పథకం కింద డబ్బులు, ఇక పిల్లలకు అమ్మ ఒడి, ఫీజు రీ ఇంబర్స్ మెంట్ రైతు భరోసా ఇలా చూసుకుంటే ఒక కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయలు దాకా డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో పడుతూ ఉండేవి.

ఇపుడు చూస్తే కొత్త ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడచిపోయింది. ఏ పధకం ద్వారా అయినా నగదు వస్తుందేమో అని చూస్తే ఏదీ పడటం లేదు అని అంటున్నారు. జగన్ కంటే రెట్టింపు పధకాలు అమలు చేస్తామని పెద్ద ఎత్తున జనంలో వెల్ ఫేర్ స్కీములను అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు కానీ రెండు నెలలు గడిచిపోయాయి కానీ ఏమీ లేవు అన్న మాట ఉంది. ఇక అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చిన వెంటనే పథకాలు అమలు చేస్తారు అనుకుంటే ఈ ఏడాది అసలు ఏ మాత్రం ఆశలు పెట్టుకోవద్దని చెప్పేశారు అంటున్నారు.

తల్లికి వందనం పధకం అన్న దానినే తీసుకుంటే అందరితో మాట్లాడి తరువాత వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ చెప్పేశారు. ఉచిత గ్యాస్ పధకం అన్నది ఇవ్వడం లేదు అధ్యక్షా అని అసెంబ్లీలోనే మరో మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

ఇలా ఏ పధకమూ అమలు కాకపోవడం లేదు. ఆఖరుకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం అని అన్నారు. అయితే అది కూడా ఎపుడు చేస్తారో తెలియడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా వస్తున్న కొన్ని సర్వేలు చూస్తే దిగువ తరగతి వాళ్ళకు చంద్రబాబు ప్రభుత్వం పనితీరు ఏ మాత్రం నచ్చడం లేదు అని నివేదికలు వస్తున్నాయని అంటున్నారు.

ఇక ఏపీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అని జగన్ అప్పులు చేశారని టీడీపీ కూటమి పెద్దలు చెబుతున్నారు. కానీ అవన్నీ జనాలకు అనవసరం అంటున్నారు. ఎందుకంటే జగన్ ఎక్కడ నుంచి అప్పు తెస్తే ఏమిటి మాకు పధకాలు అందాయి కదా అన్నది దిగువ తరగతి జనాల వాదనగా ఉంది. అలాగే టాక్స్ పేయర్స్ కట్టే వాటి నుంచి కూడా తీసి జగన్ ఆనాడు పధకాలకు ఖర్చు పెట్టేవారు అని కూడా అంటున్నారు.

ఒక్కో పధకం గురించి జనాలు ఆరా తీస్తూంటే జవాబు చెప్పేవారు అయితే లేరు. ఉచిత బస్సు మీద ఎన్నో సార్లు మంత్రి ప్రకటనకు చేస్తూ త్వరలో అని చెప్పడమే తప్ప అది అమలు చేసేది లేదని మండిపడుతున్నారు. ఈ ఆర్ధిక సంవస్తరంలో అపుడే ఏడు నెలలు మాత్రమే మిగిలాయి. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు. ఈ రోజుకీ దాని విధి విధానాలు ఏమిటో చెప్పడంలేదు. అంటే ఈ ఏడాది ఉంటుందా లేదా అన్న చర్చ కూడా బయల్దేరింది.

చాలా గొప్పగా సూపర్ సిక్స్ పధకాలు అని ఎన్నికల వేళ వల్లించారు.కానీ అవి అవుతాయో లేవో తెలియడంలేదు అని అంటున్నారు. ఇక టీడీపీ కూటమి కి ఈ పధకాలు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్ధం కావడం లేదు అని అంటున్నారు. గతంలో అయితే వేరు. కానీ ఈ సోషల్ మీడియా యుగం సాఫ్ట్ ఫోన్లు ఉన్న రోజులలో జనాలను సంతృప్తి పరచడం అంత ఈజీ టాస్క్ కాదని అంటున్నారు.

ఎందుకు అంటే జగన్ ఏకంగా అయిదేళ్ళ కాలంలో 2 లక్షల 72 వేల కోట్లు పంచితే జనాలు ఇచ్చిన సీట్లు కేవలం 11 మాత్రమే. మరి చంద్రబాబు తాను చెప్పినట్లుగా పధకాలు తుచ తప్పకుండా అమలు చేయకపోతే ఆయనకు కూడా జనాలు వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు.

జగన్ ప్రతీ ఇంటికీ ఉచిత పధకాలు అలవాటు చేశారు. ప్రతీ వారి బ్యాంక్ బ్యాలెన్స్ ని అమాంతం పెంచేశారు. దాంతో దానికి బాగా అలవాటు పడిన జనాలు రాష్ట్రం ఎలాగుంటే మాకేంటి మాకు ఇవ్వాల్సినవి ఇచ్చేయాల్సిందే అని డిమాండ్ చేసే స్థాయికి వెళ్తున్నారు. దీంతో టీడీపీ కూటమికి మరి కొద్ది కాలంలోనే జనాల అసహనం ఏంటో పూర్తిగా అర్ధం అవుతుంది అని అంటున్నారు.