లేట్ గా అయినా లేటెస్ట్ గా జగన్...!
ఏపీలో పోలింగ్ ముగిసి ఇరవై నాలుగు గంటలు దాటింది. ఏపీలో పోలింగ్ సరళి మీద అంతా తమదైన శైలిలో స్పందించారు
By: Tupaki Desk | 14 May 2024 1:37 PM GMTఏపీలో పోలింగ్ ముగిసి ఇరవై నాలుగు గంటలు దాటింది. ఏపీలో పోలింగ్ సరళి మీద అంతా తమదైన శైలిలో స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే పోలింగ్ పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే మీడియా సమావేశం పెట్టి మరీ కూటమి భారీ మెజారిటీతో గెలవబోతోంది అని తేల్చి చెప్పేశారు. అనూహ్య ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వారణాసి టూర్ లో ఉన్నా కూటమికి క్లీన్ స్వీప్ అని చెప్పేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అయితే ధర్మం గెలిచిందని అన్నారు. కూటమి పక్షాన ప్రజలు ఉన్నారని ఆమె ట్వీట్ చేసారు. టీడీపీ యువ నేత నారా లోకేష్ తో పాటు చాలా మంది పోలింగ్ సరళి మీద తమదైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
అయితే ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నుంచి మాత్రం స్పందన రాలేదు. దాంతో వైసీపీలోనూ చర్చ సాగింది. వైసీపీ నేతలు ఆ పార్టీ అనుకూల మీడియ సోషల్ మీడియాలో వైసీపీ గెలిచి తీరుతుందని చెబుతూ వస్తున్నారు. కానీ అధినాయకుడు మాత్రం పూర్తి స్థాయిలో మౌనం దాల్చడం పట్ల ఒకింత చర్చ అయితే సాగింది.
ఎట్టకేలకు మే 14 సాయంత్రం 4.44 నిముషాలకు జగన్ నుంచి ఒక ట్వీట్ వెలువడింది. ఆ ట్వీట్ లో జగన్ "ఈ సందర్భంగా నా అవ్వాతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన వైసీపీ కోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను" అంటూ పేర్కొన్నారు.
అంటే మరోసారి తాను సీఎం అని జగన్ ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీనితో వైసీపీ శ్రేణులలో ఆనందం వెల్లి విరుస్తోంది. ఇక మళ్లీ మనదే ప్రభుత్వం అని జగన్ చెప్పడంతో ఆ పార్టీ వర్గాలు సైతం కొత్త హుషార్ ని తెచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే పులివెందులలో ఓటు వేసి తాడేపల్లి నివాసానికి చేరుకున్న జగన్ పోలింగ్ సరళి మీద ఇంత లేట్ గా స్పందించడం పట్ల కూడా చర్చ సాగుతోంది. అన్ని రకాలైన నివేదికలు తెప్పించుకున్న మీదటనే ముఖ్యమంత్రి ఈ ట్వీట్ పూర్తి విశ్వాసంతో చేశారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే వైసీపీ గెలుస్తుంది అన్న ఆ పార్టీ నేతల మాటలను టీడీపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తోంది. ఖేల్ ఖతం దుకాణం బంద్ అని ఘాటు విమర్శలు చేస్తోంది. వచ్చేది కూటమి ప్రభుత్వం ఇది ఖాయమని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ చేసిన ట్వీట్ తో వైసీపీలో హర్షం వ్యక్తం అవుతూంటే టీడీపీ మాత్రం మేమే కింగ్ అని చెబుతోంది.