బాబు లోకేష్ పవన్ టార్గెట్ గా జగన్ భారీ వ్యూహం...!
ఈ విషయంలో జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అదే విధంగా తాను కూడా ఆయా చోట్ల పర్యటనలు చేస్తున్నారు
By: Tupaki Desk | 23 Feb 2024 11:30 PM GMTఏపీలో ఆ ముగ్గురు నేతలను వచ్చే ఎన్నికల్లో గెలవనీయకూడదు అన్నది వైసీపీ పంతంగా ఉంది. గతసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు సీట్లలో ఓటమి పాలు అయ్యారు. మంగళగిరిలో నారా లోకేష్ ఓడారు. కుప్పంలో చంద్రబాబు అయితే ఓడి గెలిచారు. ఆయన మెజారిటీ దారుణంగా ముప్పయి వేలకు పడిపోయింది. ఈసారి అయితే ముగ్గురూ గెలవకూడదు అన్నది వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది.
ఈ విషయంలో జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అదే విధంగా తాను కూడా ఆయా చోట్ల పర్యటనలు చేస్తున్నారు. ఇక ఈ నెల 26న జగన్ కుప్పం పర్యటన పెట్టుకున్నారు. కుప్పానికి జగన్ వస్తున్నారు అంటే అది పొలిటికల్ గా రీసౌండ్ చేసే లాగానే ఉంటుంది అని అంటున్నారు. ఆ రోజున జగన్ హంద్రీనీవా ద్వారా క్రిష్ణా జలాలను కుప్పానికి అందించనున్నారు.
ఈ కార్యక్రమం తరువాత జగన్ గుండిశెట్టిపల్లి వద్ద జరిగే సభలో పాల్గొంటారు. ఇదే సందర్భంగా ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయి కుప్పలో వైసీపీ గెలుపు విషయంలో పూర్తిగా సమీక్ష చేయనున్నారు అని అంటున్నారు.
కుప్పం ని గెలిస్తే అంతకంటే మరో ఘన విజయం లేదు అన్నట్లుగా వైసీపీ హై కమాండ్ భావిస్తోంది. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అయితే ఆయనకు ఉన్న శాఖలతో పాటు కుప్పం బాధ్యతలు అదనంగా ఇచ్చారు. ఆయన వీలైనపుడల్ల తన సొంత నియోజకవరం పుంగనూరు కంటే కూడా కుప్పంలోనే పర్యటిస్తున్నారు.
బీసీ నేత ఎమ్మెల్సీ అయిన భరత్ ని చంద్రబాబుకు పోటీగా వైసీపీ నిలబెడుతోంది. కుప్పంలో పంచాయతీల నుంచి వైసీపీ గెలుపు ప్రారంభమయింది. ఇపుడు నియోజకవర్గంలో జెండా ఎగురవేయాలని చూస్తోంది. దీంతో జగన్ పర్యటన ఆసక్తిని రేపుతోంది. అదే విధంగా భీమవరంలో కూడా జగన్ పర్యటన మరోసారి ఉంటుందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల తాను పోటీ చేసే సీటు భీమవరం అని ఇండైరెక్ట్ గా ప్రకటించారు. దాంతో భీమవరంలో విజయం కోసం వైసీపీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రియల్ హీరో మా ఎమ్మెల్యే ని ఈ మధ్య జరిగిన భీమవరం సభలో పవన్ ప్రకటించారు. ఆనాటి సభకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారు.
ఇక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా తాను పక్కా లోకల్ అని అందరికీ అందుబాటులో ఉంటాను అని చెబుతున్నారు. పవన్ భీమవరానికి చుట్టపు చూపుగా వచ్చే నేత తప్ప ఎమ్మెల్యే కాలేడని కూడా ఆయన సెటైర్లు వేశారు. ఇప్పటికే భీమవరానికి వైసీపీ వివిధ కార్యక్రమాలకు నిధులు ఇచ్చింది. మరింత నిధులు ఇచ్చి ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా కొన్ని కీలక కార్యక్రమాలను ప్రారంభించాలని కూడా వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.
అదే విధంగా మంగళగిరి విషయంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. పార్టీని వీడిన ఆర్ రామకృష్ణారెడ్డిని తిరిగి రప్పించుకున్నారు. రాజకీయ మంత్రాంగం చేస్తున్నారు. తొందరలో అక్కడ కూడా సీఎం జగన్ పర్యటించేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఈ మూడు సీట్లు వైసీపీకి చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఈ ముగ్గురినీ టార్గెట్ గట్టిగానే చేస్తున్నారు. రిజల్ట్ ఏమిటి అన్నది జనాలే చెప్పాలి.