షర్మిలని కూడా బాబు ఖాతాలో వేసిన జగన్ !?
కాంగ్రెస్ పార్టీ కూడా బీఫారాలు అన్నీ బాబు ద్వారానే పుచ్చుకుంటుంది అని జగన్ సెటైర్లు వేస్తున్నారు.
By: Tupaki Desk | 21 April 2024 3:48 AM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ఒంటరిని అని ప్రతీ సిద్ధం సభలోవ్ చెప్పుకొస్తున్నారు. తనను ఓడించేందుకు కూటమి కట్టి నక్కలు తోడేళ్ళు అన్నీ కలసికట్టుగా వస్తున్నాయని చెబుతున్నారు. ఇక గోదావరి జిల్లాల నుంచి ఆయన స్పీచ్ లో కొంచెం తేడా కనిపిస్తోంది.
ఇప్పటిదాక కూటమి లో ఉన్న బీజేపీ జనసేన పార్టీలనే బాబుకు తోడు అని అనేవారు. కానీ ఆయన గోదావరి సభల నుంచి కాంగ్రెస్ ని కూడా జత కలుపుతున్నరు. కాంగ్రెస్ పార్టీ కూడా బీఫారాలు అన్నీ బాబు ద్వారానే పుచ్చుకుంటుంది అని జగన్ సెటైర్లు వేస్తున్నారు.
ఏపీలో ఉన్న పార్టీలు కూటమిలో పార్టీలు అన్నిటికీ బీఫారాలు ఇచ్చేది బాబే వాటికి ఒకే ఒక యూనిఫాం కూడా బాబే అని జగన్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా పిఠాపురం అనకాపల్లి సభలలో కూడా జగన్ ఇదే మాటలను అన్నారు. దీనిని బట్టి చూస్తే తన చెల్లెలు షర్మిల లీడ్ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన బాబు కనుసన్ననలో నడిచే పార్టీగానే చూస్తున్నారా అన్న చర్చ వస్తోంది. దానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు.
కడపలో ఎంపీగా షర్మిల పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కి ఏపీలో ఏ మాత్రం బలం లేదు. ఎమ్మెల్యే కూడా ఎక్కడా గెలిచింది లేదు, డిపాజిట్లే గల్లంతు అవుతున్నాయి. అలాంటిది షర్మిల ఏకంగా ఏడు అసెంబ్లీ సీట్లకు అనుసంధానం అయిన ఎంపీ సీటుకే పోటీ చేస్తున్నారు అంటే కచ్చితంగా ఆమెకు గట్టి భరోసావే లభించి ఉంటుంది అని అంటున్నారు.
అలా చాలా మంది అనుమానిస్తున్నారు కూడా. షర్మిల గెలవడం అన్నది టీడీపీకి ముఖ్యమే అంటున్నారు. షర్మిల గెలిచి కాంగ్రెస్ కి బలమైన లీడర్ గా నిలబడితే ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వెనక్కి వస్తుంది. అలా వైసీపీ బలహీనపడుతుంది. అపుడు జగన్ రాజకీయంగా బలహీనపడతారు అన్న లెక్కలతోనే తెర వెనక నుంచి టీడీపీ షర్మిలకు మద్దతు ఇస్తోందని అందుకే బలహీనమైన అభ్యర్ధిని కడప ఎంపీ సీటుకు పెడుతోందని అంటున్నారు.
ఇలాంటి సంకేతాలు సొంత జిల్లా నుంచి ఆయనకు రాకుండా ఉండవు. అందుకే ఆయన కాంగ్రెస్ కూడా బాబు జేబులో పార్టీయే అంటున్నారు. దానిని బట్టి సొంత చెల్లెలు కూడా బాబు కూటమిలో ఉంటూ తనకు ఎదురు నిలుస్తోంది అని జనలకు చెప్పినట్లు అవుతోంది. ఏది ఏమైనా అంతా ఏకమయ్యారు. కానీ తాను జనం బలంతోనే వారిని ధీటుగా ఎదుర్కొంటాను అని జగన్ అంటున్నారు.