ఫలితాలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ !
‘ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ప్రజలు బాగుండాలని మంచి చేశాం. మంచి చేసినా ఓటమిపాలయ్యాం
By: Tupaki Desk | 4 Jun 2024 2:29 PM GMT‘ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ప్రజలు బాగుండాలని మంచి చేశాం. మంచి చేసినా ఓటమిపాలయ్యాం. ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు. మహిళలకు సంక్షేమ ఫలాలు అందించాం.వారి ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు’ అని ఏపీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు.
53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం. అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 26 లక్షల మంది అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేశాం
మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన చాలీచాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేశాం. అవ్వాతాతల ప్రేమ ఏమైందో తెలియదు? కోటి ఐదు లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు మంచి చేశాం. వాళ్ల కష్టాల్ని మా కష్టాలుగా భావించాం
చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో తెలియదు? రైతన్నలకు ఎంతగానో తోడుగా నిలిచాం. అన్నదాతలకు రైతు భరోసా అందించాం. అర కోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియదు? పేదవాళ్లకు తోడుగా ఉన్నాం. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా ఉన్నాం. వాళ్లకు వాహనమిత్ర ఇచ్చాం. మత్స్యకార భరోసా, నేతన్న చేయూత అందించాం.
రాష్ట్రంలో కోట్ల మందికి మంచి చేశాం. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించాం. ప్రజా తీర్పును గౌరవిస్తాం. అన్ని వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చాం
ధైర్యంగా ముందడుగు వేస్తాం. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అభినందనలు అని జగన్ అన్నారు.