జగన్ తప్పించుకుంటున్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ!
తాజా ఎన్నికల్లో వైసీపీ చావు దెబ్బతింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుట్ట దాఖలైంది
By: Tupaki Desk | 8 Jun 2024 3:30 AM GMTతాజా ఎన్నికల్లో వైసీపీ చావు దెబ్బతింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుట్ట దాఖలైంది. మళ్లీ కోలుకుంటుం దా? కోలుకోదా.. అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం మాత్రం వైసీపీని నిలువునా దహించేసే అంశమే. దీనికి బాధ్యులు.. అనే విషయం క్షేత్రస్థాయిలోకి వెళ్తే.. వారిపై కార్యకర్తలు, నాయకుల్లో తీవ్ర ఏహ్య భావం పెరుగుతుంది. వారికి పార్టీలోనూ చులకన ఏర్పడుతుంది. వారి మాటలు ఎవరూ విశ్వసించలేని పరిస్థితి కూడా వస్తుంది. ముఖ్యంగా ప్రజలు తిప్పికొట్టడం ఖాయమని తెలుస్తోంది. దీంతో వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
నిజానికి వైసీపీ గెలిచి ఉంటే.. ఆ బాధ్యత, క్రెడిట్ మొత్తం కూడా.. జగన్‌కే వెళ్లిపోయేది. ఎందుకంటే.. ఆయన ఎన్నికలకు ముందు.. తనను చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. ``మీ బిడ్డ ఒంటరిగా వస్తున్నాడు. కాపాడే బాధ్యత మీదే`` అంటూ.. పిలుపునిచ్చారే తప్ప.. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల గురించి ఎక్కడా ఆయన పెద్దగా ప్రస్తావించలేదు. తాను ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల గురించే చెప్పుకొచ్చారు. తాను మంచి చేసి ఉంటేనే ఓటేయాలని కూడా.. ప్రజలకు ఆయన చెప్పుకొచ్చారు. అంటే.. ఇక్కడ ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులు మంచి వారైతే.. వారికి ఓటేయాలని చెప్పలేదు. దీనిని బట్టి.. వైసీపీ గెలిచి ఉంటే జగన్ కే పూర్తి క్రెడిట్ దక్కి ఉండేదని అనడంలో సందేహం లేదు.
గెలిచిన తర్వాత.. కూడా వైసీపీ నాయకులు ఇదే ప్రచారం చేసేవారు. జగన్ ఫొటో పెట్టుకునే తాము గెలిచామని చెప్పేవారు. జగన్ వల్లే విజయం దక్కించుకున్నామని అనేవారు. ఆయన అమలు చేసిన.. కార్యక్రమాల వల్లే విజయం సాధించామని చెప్పేవారు. కానీ, ప్లేట్ తిరగబడింది. మరిదీనికి ఎవరు బాధ్యులు..? అంటే.. నిస్సందేహంగా ఎవరైతే.. తనను చూసి ఓటేయాలని కోరారో వారే.. ఆ జగనే బాధ్యులు. ఈ విషయంలో మైండ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యేది ఇదే.అయితే.. ఈ విషయం బయటకు వెళ్తే.. ఇప్పటి వరకు జగన్ పెంచుకున్న విశ్వసనీయత గొటడ్డలి వేటుకు గురవుతుంది. ఆయనపై ప్రజల్లో అంతో ఇంతో ఉన్న ఇమేజ్ కూకటివేళ్లతో సహా పెకలించి పోతుంది.
ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా తమ ఓటమికి తమ కారణాలు వెతుక్కోకుండా.. సీఎంవోపైకి తోసేస్తున్నారన్న భావన ఉంది. ఇదేసమయంలో పార్టీ అధినేత పై పన్నెత్తు మాట అనకుండా.. కేవలం సీఎంవోలో ఓ అధికారి వల్లే ఇలా జరిగిం దని చెబుతున్నారు. కానీ, వాస్తవం ఏంటంటే.. సీఎంవోలోని ధనుంజయ రెడ్డి వల్ల వారు ఇబ్బంది పడింది వాస్తవమే. కానీ, నాడు ఎందుకు నోరు విప్పలేదు. అప్పట్లోనే ఎమ్మెల్యేలు.. అంతా ఒక్కటై..సీఎం జగన్ వద్ద ఎందుకు ప్రస్తావించలేదు.? అనేది ప్రశ్న. అంతేకాదు.. నియోజకవర్గాల్లో సమస్యలు ఆది నుంచి ఉన్నాయి.
వాటిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. రోడ్లు వేయలేదు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఇవన్నీ.. జగన్‌కు కనీసం రెండేళ్ల ముందు ఎందుకు చెప్పలేదు. అనేది ప్రశ్న. అంటే.. మొత్తంగా జగన్‌నే నమ్ముకున్నారు. ఆయన వల్లే ఓడిపోయారనేదివారికి కూడా తెలుసు. అయితే.. ఇప్పుడు ఆ మాట అంటే.. జగన్ ఇమేజ్ డ్యామేజీ అయి.. పార్టీకి దీర్ఘకాలంలో మరింత ఇబ్బంది ఏర్పడుతుందని గుర్తించి .. తప్పులన్నీ.. సీఎంవోపై కి నెట్టేస్తున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.