జగన్.. మాట జారి.. మూల్యం చెల్లించుకున్నారా?
తాజా ఎన్నికల్లో జగన్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 11 స్థానాలకే పరిమితం అయిపోయింది
By: Tupaki Desk | 19 Jun 2024 2:30 AM GMTవైసీపీ అధినేత, తాజా మాజీ సీఎం జగన్.. నోరు జారి.. మూల్యం చెల్లించుకున్నారా? ఈవీఎంలపై ఆయన చేసిన ఒకే ఒక్క వ్యా ఖ్య.. రాజకీయంగా ఆయనను బద్నాం చేసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈవీఎంలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్య.. ఆయన పరిణితికి తక్కువగా ఉందని మేధావులు కూడా వ్యాఖ్యానించారు. ఈవీఎంలను నమ్మడానికి వీల్లేదని.. అభివృద్ది చెందిన దేశాలు కూడా.. బ్యాలెట్ ఓటింగ్ వైపు నడుస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే.. ఆయన ఇప్పుడు ఈ మాట చెప్పడం సరికాదని.. నిజంగానే ఆయనకుఈవీఎంలపై అనుమానాలు ఉంటే..ఎన్నికలకు ముందు ప్రకటన చేసి ఉండాలని అంటున్నారు.
తాజా ఎన్నికల్లో జగన్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఈ నేపథ్యంలో జగన్ ఆత్మ విమర్శలు చేసుకోవాలి.. లేదా.. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తప్పులు ఎక్కడ జరిగాయో తేల్చుకోవాలి. కానీ, ఈ విషయంలోనూ వైసీపీ నాయకులు తొట్రు పడుతున్నారు. కళ్ల ముందు అనేక విషయాలు వారికి కనిపిస్తున్నాయి. పాలన పరంగా చేసిన తప్పులు.. ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. వీటిని సరిదిద్దుకుని.. ప్రజల అభిమానం పొందేదిశగా అడుగులు వేయాల్సిన పార్టీ అధినేత.. ముందుగా కొందరు తన అనుయాయులను రంగంలోకి దింపి.. జగన్‌తప్పులేదు.. అంతా అధికారులదే.. అన్నట్టుగా ప్రచారం చేయించారు.
ఈ ప్రచారం వర్కవుట్ కాలేదు. తర్వాత.. వలంటీర్ల కారణంగానే ఓడిపోయామంటూ మరికొందరితో వ్యాఖ్యలు చేయించారు. ఇవి కూడా బూమ`రాంగ్` అయ్యాయి. దీంతో ఇప్పుడు ఈవీఎంల వ్యవంహారాన్ని తప్పుబడుతూ.. జగన్ వ్యాఖ్యలు సంధించారు. ఈవీఎంలను మార్చాలని.. బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరుతున్నారు. కానీ, ఇప్పుడు ఓడిపోయిన దరిమిలా.. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి.. నోరు జారి.. కోరి మరిన్ని రాజకీయ విమర్శలు కూడబెట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ నాయకులు అనంతపురం నుంచి అనకాపల్లి వరకు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏకేశారు. గతంలో నువ్వు ఏమన్నావంటూ.. వారంతా నిలదీశారు.
ఇక, బుద్ధా వెంకన్న వంటి టీడీపీ ఫైర్‌బ్రాండ్లు మరో అడుగు ముందుకు వేసి దమ్ముంటే జగన్ పులివెందులలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దామన్నారు. మొన్న వచ్చిన మెజారిటీ కూడా జగన్‌కు వస్తుందా ? అని నిలదీశారు. అసలు జగన్ గెలుస్తారో లేదో చూద్దామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్లు వస్తే అది విజయమా.. అదే కూటమికి 164 సీట్లు వస్తే ఈవీఎంలను తప్పుబడతారా? అని ప్రశ్నించారు. ఇలా.. జగన్ ఒక్క మాట జారి అడ్డంగా దొరికిపోయి.. మరింత పలచనవుతున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజలు ఇచ్చిన తీర్పును తలదాలుస్తూ.. మున్ముందు విజయం దక్కించుకునేలా క్షేత్రస్థాయి నుంచి రాజకీయం ప్రారంభిస్తే.. బెటర్ అంటున్నారు పరిశీలకులు.