ఇది శకుని పాచికల ఇంటర్వెల్... జగన్ సంచనల వ్యాఖ్యలు!
గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు
By: Tupaki Desk | 20 Jun 2024 10:32 AM GMTగతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. గతంలో జగన్ దర్శనం కోసం ఎన్నో ఇబ్బందులు పడిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు మాజీలుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అనంతరం తేరుకున్న జగన్... వరుసగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలతో పాటు ఎమ్మెల్సీలతోనూ విడివిడిగా భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలో తాజాగా విసృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు జగన్.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఎన్నికల్లో మనకు 40 శాతం ఓట్లు పోల్ అయ్యాయనే విషయం మరిచిపోకూడదని నేతలకు చెప్పిన జగన్... 2019లో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని అన్నారు. ఈ పది శాతం ప్రజలు త్వరలో చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారని తెలిపారు.
ఇదే సమయంలో అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం న్యాయం కాదనే తాను ఎప్పుడూ చెప్తానని చెప్పిన జగన్... చంద్రబాబు ఇచ్చినన్ని హామీలు ఇవ్వాలని ఇప్పుడు చాలా మందికి అనిపించొచ్చు కానీ... విశ్వసనీయతతో చేసిన రాజకీయాలే శాస్వతం అని అన్నారు. 2014లో కూడా ఇదే చెప్పగా.. 2019లో అది నిజం అయ్యిందని తెలిపారు.
ఈ రోజు జగన్ సీఎంగా ఉండి ఉంటే... ఈపాటికే విద్యాదీవెనకు బటన్ నొక్కే వాళ్లం.. వసతి దీవెన బటన్ నొక్కేవాళ్లం అని చెప్పిన జగన్... ఇప్పటికీ ఇవి పెండింగులో ఉన్నాయని అన్నారు! ఇదే సమయంలో... రైతు భరోసా, అమ్మ ఒడిలతో పాటు చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్ లో ఉందని అన్నారు. వైసీపీ పాలన లేకపోవడంతో ఏమీ రావడం లేదనే విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
ఇదే సమయంలో... మనం ఓడిపోలేదని.. అసలు ఓడిపోయామన్న భావనను ఫస్ట్ మనసులో నుంచి తీసేయండని నేతలకు చెప్పిన జగన్... న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదని పునరుద్ఘాటించారు. ఈరోజు కూడా ప్రతీ ఇంటికీ మనం తలెత్తుకుని పోగలమని అన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ మనపట్ల ప్రజలకు ఉన్న అభిమానం మరింత పెరుగుతుందని.. తిరిగి మనం రికార్డ్ మెజారిటీతో గెలుస్తామని జగన్ నేతలకు స్పష్టం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఒక ఇంటర్వెల్ మాత్రమే అని.. శకుని పాచికలు అనే సబ్జెక్ట్ కేవలం ఇంటర్వెల్ మాత్రమే అని చెప్పిన జగన్... శ్రీకృష్ణుడు తోడున్నా పాండవులు ఓడిపోతారు.. ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ తప్పక గెలుస్తాయని అన్నారు. ప్రతీ ఒక్కరూ ఒక అర్జునుడు మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా జరగాయన్నది ఇవ్వాళ్టికీ ఆశ్చర్యకరంగా ఉందని తెలిపారు.