జిల్లాల్లో వైసీపీ రగడ.. పట్టకపోతే పెను ప్రమాదమే!
తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జిల్లాల్లో రాజకీయాలు మరింత ఇబ్బందికరంగా మారాయి
By: Tupaki Desk | 16 July 2024 7:05 AM GMTతాజా ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జిల్లాల్లో రాజకీయాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. పార్టీ అధినేత తమను పట్టించుకోవడం లేదని కొందరు, మరి కొందరైతే పార్టీలో ఉండలేమని బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి వారు చాలామంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో జిల్లాల్లోను, నియోజకవర్గాల్లోనూ ఇన్చార్జిలను మార్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కీలక బాధ్యతలు అప్పగించంది.
నియోజకవర్గంలో నాయకులను నడిపించే బాధ్యత, పార్టీ డెవలప్ చేసే బాధ్యత కూడా ఎన్నికలకు ముందే అప్పగించిన విషయం తెలిసిందే. అయితే వారంతా చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయా నాయకులు నియోజకవర్గాలను పట్టించుకోకుండా, తమ తమ జిల్లాలకు, తమ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోయారు. దీంతో స్థానికంగా ఉన్న నాయకులు ఇప్పుడు గ్రూపులుగా ఏర్పడి తమదే పెత్తనం అన్నట్టుగా నియోజకవర్గాల్లో వ్యవహరిస్తున్నారు. ఇది క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు, నాయకులకు మింగుడు పడడం లేదు.
ఎందుకంటే నిన్న మొన్నటి వరకు తామే నాయకులమని వ్యవహరించిన వారు.. వెళ్లిపోవడం, పార్టీ అధిష్టానం ఇప్పటివరకు ఎవరినీ నియోజకవర్గ ఇన్చార్జిలుగా నియమించకపోవడంతో కార్యకర్తలు నాయకులు కీచులాడుకుంటున్నారు. దీంతో ఈ అసమతి పోరును, పార్టీలో నిర్లక్ష్య వైఖరిని సహించలేక పార్టీ మారెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొందరు గ్రూపులుగా ఏర్పడి `మాకు మేమే` నాయకులం అని ప్రకటించుకున్నారు. ఇది అంతిమంగా పార్టీలో వర్గ వైషమ్యాలకు, క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును కోల్పోయేందుకు కూడా దారితీస్తుంది.
ఈ పరిణామం గనుక పెరిగినట్టు అయితే మున్ముందు జిల్లాల్లో కూడా బలమైన నియోజకవర్గాల్లో పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది. మరి ఈ విషయంపై వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది నాయకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఫలితాలు వచ్చి నెల రోజులు దాటిపోయినా జిల్లా స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సమీక్షలు చేయలేదు. ఎలాంటి నాయకులను నియమించలేదు. గతంలో ఇన్చార్జిలుగా నియమించిన వారిని అక్కడ నుంచి తొలగించలేదు. కొత్తవారికి పార్టీ పగ్గాలు అప్పగించలేదు. దీంతో జిల్లాల్లో వైసిపి రగడ ఇలా పెరుగుతూ పోతే.. పార్టీ అస్థిత్వానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.