Begin typing your search above and press return to search.

ఇందిరలా.. బంగ్లాలో మోదీ జోక్యం.. బెంగాల్ బీజేపీ ఎంపీ సంచలన సూచన

అల్లర్లతో అట్టుడికి.. ప్రధాని రాజీనామాతో ప్రభుత్వం పడిపోయి.. ఆపధర్మ సర్కారు ఏర్పడిన బంగ్లాదేశ్ లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు చాలా రోజులు పట్టేలానే ఉంది

By:  Tupaki Desk   |   7 Aug 2024 10:48 AM GMT
ఇందిరలా.. బంగ్లాలో మోదీ జోక్యం.. బెంగాల్ బీజేపీ ఎంపీ సంచలన సూచన
X

అల్లర్లతో అట్టుడికి.. ప్రధాని రాజీనామాతో ప్రభుత్వం పడిపోయి.. ఆపధర్మ సర్కారు ఏర్పడిన బంగ్లాదేశ్ లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు చాలా రోజులు పట్టేలానే ఉంది. అయితే, అక్కడ మైనారిటీలైన హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నట్లుగా కథనాలు వస్తున్నయి. వీటిలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. అయితే, ఈలోగా బీజేపీకి చెందిన పశ్చిమ బెంగాల్ ఎంపీ ఒకరు సంచలన సూచన చేశారు.

అప్పట్లో ఏం జరిగింది?

భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయిన 1947లో బంగ్లాదేశ్ ను తూర్పు పాకిస్థాన్ గా వ్యవహరించేవారు. అయితే, అన్ని విధాల పాకిస్థాన్ అణచివేతల కారణంగా, 1960లకు వచ్చేసరికి బంగ్లాదేశ్ లో ప్రత్యేక దేశంగా కావాలన్న డిమాండ్లు బాగా పెరిగాయి. అదే స్వాతంత్ర్య ఉద్యమంగా మారింది. దీంతో మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్ ముందుండి పోరాటం నడిపించారు. దీంతో పాకిస్థాన్ ఆయనను జైలులో పెట్టింది. స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. నిర్బంధం అధికం కావడంతో బంగ్లా నుంచి లక్షల మంది ప్రజలు భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లోకి చొచ్చుకొచ్చారు. ఇది భారత సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉండడంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీవ్రంగా స్పందించారు. బంగ్లా-పాక్ ఘర్షణల్లో జోక్యం చేసుకున్నారు. బంగ్లా స్వాతంత్ర్య సమరయోధులకు సైనిక సాయం అందించారు. ఆ తర్వాత బంగ్లా స్వాతంత్ర్య కాంక్ష నెరవేరింది. ఈ సమయంలోనే కాక బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి వలసలు సాధారణంగా మారిపోయాయి. సరిహద్దుల్లోని కొన్ని జిల్లాల్లో ఓ వర్గం జనాభా విపరీతంగా పెరిగిపోయింది.

ఇప్పుడు మోదీ అదే చేయాలట..

బంగ్లా సంక్షోభంలో భారత ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని సంచలన సూచన చేశారు పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ జగన్నాథ్. బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రం, పైగా బీజేపీ ఎంపీనే ప్రతిపాదన చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్ లో హసీనా సర్కారు భారత్ కు పూర్తి అనూకులంగా వ్యవహరించింది. కానీ, ఇప్పుడు భారత వ్యతిరేక శక్తుల చేతుల్లోకి పాలన వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ జగన్నాథ్ సూచన చేయడం గమనార్హం. అంతేగాక మోదీ మాత్రమే బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించగలరని పేర్కొన్నారు. మోదీ దౌత్య లేదా సైనిక చర్యలు తీసుకోవాలని సూచించారు.

విభజనవాదంలో వివాదాస్పద సూచన

డార్జిలింగ్ లాంటి ప్రాంతాలతో కలిపి బెంగాల్ ను ఇప్పటికే విభజించాలని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కోరుతున్నారు. బంగ్లా సరిహద్దు రాష్ట్రం కావడంతో దీనికి ప్రాధాన్యం ఉంది. సీఎం మమతా బెనర్జీ వంటి వారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.