1978 తర్వాత తెరచుకోనున్న జగన్నాథుడి ఖజానా... తాళంకప్ప బద్దలు కొడతారా?
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆభరణాల గురించి, ఆ ఖజానా గురించి రకరకాలుగా చెబుతుంటారు.
By: Tupaki Desk | 10 July 2024 6:37 AM GMTఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆభరణాల గురించి, ఆ ఖజానా గురించి రకరకాలుగా చెబుతుంటారు. అది కళ్లు చెదిరే ఖజానా అని, అందులో ఉన్న వజ్ర వైఢ్యూర్యాలు, గోమేధికలు, కెంపులు, పుష్యారాగాలు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాలను అప్పట్లో ఐదు చెక్కపెట్టేల్లో ఉంచి భద్రపరిచారు. వీటిని చివరిసారిగా 1978లో లెక్కించారు. ఈ నేపథ్యంలో సుమారు 46 ఏళ్ల తర్వాత తిరిగి లెక్కించనున్నారు.
అవును... కళ్లు చెదిరే ఖజానాగా చెప్పే పూరీ జగన్నాథుడి భాండాగారాన్ని త్వరలో తెరవనున్నారు. వాస్తవానికి పూర్వం మూడేల్లు, లేదా ఐదేళ్లకు ఒకసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. ఈ నేపథ్యంలో 1978లో చివరిసారి లెక్కించారు. నాడు ఈ సంపద లెక్కించడానికి సుమారు 70 రోజులు పెట్టిందని చెబుతారు. అయితే అప్పట్లో కొన్నింటిని వదిలేశారని, అందువల్ల లెక్కల్లో సందేహాలున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... ఆ భాండాగరం తెరిచి సంపద తిరిగి లెక్కించాలని ఆదేశించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇదే సమయంలో వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేయాలని 2018లొనే పురావస్తు శాఖను ఆదేశించింది. దీంతో 2019 ఏప్రిల్ లో నాటి నవీన్ పట్నాయక్ సర్కార్ నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవగా.. రహస్య గది తాళపు చెవి కనిపించలేదు.
దీంతో ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మరమ్మత్తులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది. అయితే... ఇంతలో డూప్లికెట్ తాళపుచెవి పూరీ కలెక్టరేట్ ట్రజరీలో ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో... తాము అధికారంలోకి వస్తే ఈ భాండాగారం తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ హామీకి కట్టుబడి రిటైర్డ్ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది.
దీంతో సుమారు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న ఈ భాండాగారాన్ని తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన మరమ్మత్తులు చేపట్టనున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన జస్టిస్ రథ్... భాండాగారం తెరవడంతోపాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో కలెక్టరేట్ లో ఉన్న తాళం చెవితో తెరుచుకోకపోతే.. తాళకప్ప పగలగొట్టి తెరవనున్నారు!