Begin typing your search above and press return to search.

ప్రైవేటు సెక్యూరిటీ అవసరమేంటి జగన్? ఈ తప్పులేంది?

నిజానికి ఒక పార్టీ అధినేతగా ఆయనకు కల్పించాల్సిన భద్రతకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవచ్చు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 9:30 AM GMT
ప్రైవేటు సెక్యూరిటీ అవసరమేంటి జగన్? ఈ  తప్పులేంది?
X

అధికారం చేతిలో ఉన్నప్పుడు ఒకలా.. చేజారిన తర్వాత మరోలాంటి పరిస్థితులు మామూలే. నిజానికి ఇవేం తెలియనంత వ్యక్తి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమకున్న పరిస్థితులు.. తన తండ్రి అనూహ్య మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. ఏళ్లకు ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎదురైన పరిస్థితుల అనుభవం ఆయనకు ఉంది. అలాంటప్పుడు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరు.. తీసుకుంటున్న నిర్ణయాలు చర్చగా మారుతున్నాయి. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉంటున్నాయి.

సాధారణంగా అధికారం చేజారిన తర్వాత.. కొంతకాలం పాటు సానుభూతి ఉండదు. ప్రజల్లో తమ పట్ల పోయిన సానుకూలతను తిరిగి తెచ్చుకోవటమే పెద్ద టాస్కుగా మారుతుంది. అలాంటి వేళలో సమయం కోసం వెయిట్ చేయటం.. లేదంటే కొత్త ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తూ.. ప్రజల కోసం పోరాటం చేయటం ద్వారా తిరిగి పాత వైభవాన్ని తెచ్చుకునే వీలుంటుంది. ఇంత చిన్న విషయాన్ని గడిచిన కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న అధినేత ఎలా మిస్ అవుతారు? అన్నది ప్రశ్న.

చేతిలో ఉన్న ముఖ్యమంత్రి పదవి పోయి నెల కూడా కాలేదు. కొత్త ప్రభుత్వం కొలువు తీరి వారమే అయ్యింది. అప్పుడే.. తనకు రక్షణగా ప్రైవేటు సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకోవటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రజాజీవితంలో ఉన్న వారు ఆడంబరాలకు.. హెచ్చులకు.. హంగులకు.. అర్బాటాలకు పోతే ప్రజలు ఇష్టపడరు. అందుకు భిన్నంగా అంత స్థాయిలో ఉండి కూడా.. తగ్గి ఉండటం.. సామాన్యులకు అందుబాటులో ఉంటూ.. వారిలో కలిసిపోయే తీరును ప్రజలు కోరుకుంటారు.

అందుకు భిన్నంగా వ్యవహరిస్తే వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు. ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జగన్ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలే సొంతం కావటంతో.. ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఆయన ఇకపై అసెంబ్లీకి సాధారణ ఎమ్మెల్యేగా రావాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లే ఆయన భద్రతలోనూ మార్పులు చేశారు. నిజానికి ఒక పార్టీ అధినేతగా ఆయనకు కల్పించాల్సిన భద్రతకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవచ్చు. అలాంటి వేళలో మౌనంగా ఉండటం ద్వారా కొత్త ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్న విషయం ప్రజల్లోకి వెళుతుంది.

అందుకు భిన్నంగా ప్రైవేటు సెక్యూరిటీని భారీగా ఏర్పాటు చేసుకుంటే ప్రజల్లో వెళ్లే సంకేతం ఏమిటి? అన్నది ప్రశ్న. సాదాసీదాగా ఉండాల్సిన వేళ.. ముందస్తుగా ప్రైవేటు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవటం.. దానికి సంబంధించిన హడావుడి తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద చోటు చేసుకోవటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. విపక్షంలో ఉన్న వేళలో వీలైనంత సాదాసీదాగా ఉండాల్సిన వేళలో.. ఈ హంగు అర్బాటాలేమిటి? ఇలాంటి సలహాలు ఆయనకు ఎవరిస్తున్నారు? ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిదీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉండటంపై వైసీపీ వర్గాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.