Begin typing your search above and press return to search.

నో పాలిటిక్స్...జగన్ రూటే సెపరేట్...!

విశాఖకు జగన్ వచ్చారు వెళ్లారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది అధికారిక కార్యక్రమం.

By:  Tupaki Desk   |   14 Feb 2024 3:30 AM GMT
నో పాలిటిక్స్...జగన్ రూటే సెపరేట్...!
X

విశాఖకు జగన్ వచ్చారు వెళ్లారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది అధికారిక కార్యక్రమం. ఆడుదాం ఆంధ్రా అంటూ రెండు నెలల పాటు ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన క్రీడల పోటీల ముగింపు కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అథిదిగా హాజరైన జగన్ కాసేపు క్రికెట్ మ్యాచ్ ని చూశారు. అనంతరం ఆయన కొద్ది సేపు మాత్రమే ప్రసంగించారు.

ఆ స్పీచ్ మొత్తం క్రీడలకే పరిమితం అయింది. ఏపీలో ఎన్నికల వేడి ఒక వైపు ఉంది. ఉత్తరాంధ్రానే ప్రధాన పార్టీలు అన్నీ ఫోకస్ చేసి యాత్రలు చేస్తున్నాయి. తీవ్రమైన విమర్శలు వైసీపీ మీద జగన్ మీద చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో విశాఖలో జగన్ స్పీచ్ ఒక రేంజిలో ఉంటుందని ఊహించిన వారికి నిరాశ మిగిలింది.

జగన్ క్లుప్తంగా సంక్షిప్తంగా స్పీచ్ ఇచ్చారు. అది కూడా కేవలం ఆటల గురించే మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసినదే చెప్పారు. ఆ తరువాత చాలా సేపు వేదిక మీదనే ఉంటూ విజేతలకు ట్రోఫీలు అందచేశారు. మొత్తానికి చూస్తే జగన్ విశాఖలో నాలుగైదు గంటలు గడిపారు. కానీ ఆ టైం అంతా క్రీడలకు సంబంధించిన ఈవెంట్ కే పరిమితం చేశారు.

నో పాలిటిక్స్ అన్నట్లుగా సీఎం స్పీచ్ ఉంది. ఇటీవల కాలంలో చూసుకుంటే జగన్ పలు బహిరంగ సభలలో మాట్లాడుతూ కొంతసేపూ విపక్షాల మీద విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఈసారి దానికి భిన్నంగా కేవలం ఈవెంట్ వరకే అన్నట్లుగా వ్యవహరించారు. ఒక విధంగా చూస్తే సీఎం పాలిటిక్స్ ని అసలు టచ్ చేయకూడదు అని ముందే అనుకుని వచ్చారని అనిపిస్తోంది.

ఇటీవలే విశాఖలో సిద్ధం సభను గ్రాండియర్ గా నిర్వహించి విపక్షానికి సవాల్ విసిరిన తరువాత పట్టుమని పదిహేను రోజుల తేడాలోనే విశాఖకు సీఎం వచ్చారు. కానీ పొలిటికల్ మసాలా లేని ప్యూర్ అఫీషియల్ టూర్ గానే ఇది సాగింది. ఉత్తరాంధ్రలో లోకేష్ శంఖారావం సభలు జరుగుతున్న టైం లో సీఎం విశాఖ వచ్చినా టీడీపీ మీద కూడా ఒక్క సెటైర్ వేయకపోవడం గమనార్హం.