ముందు జగన్ .. తర్వాత బాబు .. మరి ఇప్పుడు ?
ఏపీ ఎన్నికల సమరంలో 151 శాసనసభ స్థానాల నుండి వైసీపీ ఏకంగా 11 స్థానాలకు పడిపోయింది.
By: Tupaki Desk | 27 Jun 2024 5:30 AM GMTఏపీ ఎన్నికల సమరంలో 151 శాసనసభ స్థానాల నుండి వైసీపీ ఏకంగా 11 స్థానాలకు పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసిన తరువాత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన పార్టీ అధ్యక్షుడు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు రెండో రోజే అసెంబ్లీకి దూరమయ్యారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వైసీపీ సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని సభా సమావేశాలకు దూరంగా ఉండిపోయింది. ఈ సారి కూడా వారు శాసనసభ సమావేశాలకు హాజరవుతారా ? లేక దూరంగా ఉంటారా ? అన్న ఆసక్తి నెలకొంది.
రాష్ట్ర విభజన అనంతరం 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టారు. ఆ సమయంలో వైఎసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైసీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీని బహిష్కరించాలని 2017 అక్టోబర్ 25న వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత మళ్ళీ ఎన్నికల్లో గెలిచిన తరువాతే జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు 2019 జూన్ 12న అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంలో రెండున్నర ఏళ్ల పాటు శాసనసభకు దూరంగా ఉన్నారు. అయితే చంద్రబాబు అసెంబ్లీకి దూరంగా ఉన్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హజరయ్యారు. అసెంబ్లీలో తన కుటుంబాన్ని అవమానపర్చేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని, మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలోకి అడుగుపెడతానని శపథం చేసి 2021 నవంబర్ 19న ఏపీ అసెంబ్లీ నుండి బయటకు వచ్చారు. 2024 ఎన్నికల్లో కూటమితో కలిపి 175 స్థానాలకు 164 స్థానాలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత జూన్ 21న ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టడం విశేషం.
ఈ నేపథ్యంలో సభలో ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే జగన్, ఆయన సహచర శాసనసభ్యులు సభకు దూరంగా ఉంటున్నారు. తాజాగా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, 10 శాతం స్థానాలు సాధిస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదని జగన్ స్పీకర్ కు లేఖ రాశాడు. జగన్ లేఖపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వైసీపీ శాసనసభ సమావేశాలకు హాజరవుతుందా ? దూరంగా ఉంటుందా ? అన్న చర్చ మొదలయింది.