ప్రత్యేక హోదా.. రైల్వే జోన్.. అయిదేళ్లు మరిచావా జగన్?
గుర్తున్నా.. ఉన్నట్టు నటిస్తారే తప్ప.. కార్యాచరణకు వచ్చే సరికి కుప్పిగంతులు వేస్తూనే ఉన్నారు.
By: Tupaki Desk | 3 July 2024 12:30 PM GMTఏపీ అభివృద్దికి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కూడా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమే. ఇక, విశా ఖలో రైల్వేజోన్ ఏర్పాటు కూడా.. అత్యంత కీలకమే. అయితే.. వీటిని సాధించుకునే క్రమంలోనే రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు.. చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ అనుసరి స్తున్న వైఖరి మరింత వివాదంగా.. విడ్డూరంగా కూడా ఉందనే చర్చ సాగుతోంది. దీనికి కారణం.. అధికా రంలో ఉంటే.. ఈ రెండు అంశాలు ఆయనకు గుర్తుండవు.
గుర్తున్నా.. ఉన్నట్టు నటిస్తారే తప్ప.. కార్యాచరణకు వచ్చే సరికి కుప్పిగంతులు వేస్తూనే ఉన్నారు. అదే అధికారంలో లేకపోతే.. మాత్రం ఇంటా బయటా కూడా.. గళం వినిపిస్తారు. ఇంకేముంది.. ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతోందని అంటారు. 2014-19 మధ్య ఇదే జరిగింది. తాను అధికారంలో లేకపోవడంతో జగన్‌కు ప్రత్యేకహోదా, విశాఖ రైల్వే జోన్ వంటివాటితోపాటు.. విభజన చట్టంలోని అంశాలు కూడా బాగానే గుర్తున్నాయి. అందుకే అప్పట్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున యాగీ చేశారు.
అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్యా కేజీకి అంగీకరించడాన్ని ఊరూవాడా తిరుగుతూ... ఏకేశారు. దీంతో కేంద్రంతో గొడవ పడేలా.. టీడీపీ-బీజేపీ బంధం తెగిపోయేలా పక్కా ప్లాన్‌తో వ్యవహరించారు. ఫలితంగా చంద్రబాబు వీధికెక్కారు. ధర్మపోరాట దీక్షాలు అంటూ.. ఢిల్లీలో నిరసన తెలిపారు. తర్వాత.. ఎన్నికల్లో జగన్ విజయం దక్కించుకున్నారు. చి త్రం ఏంటంటే.. అప్పటి వరకు.. హోదా, జోను అంటూ.. వ్యాఖ్యానించిన జగన్‌కు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవేవీ గుర్తు లేవు.
ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ.. ప్లీజ్-ప్లీజ్ అంటున్నానని చెప్పినా.. 22 మంది లోక్‌సభ సభ్యులు, 8 మంది(అప్ప ట్లో) రాజ్యసభ సభ్యులు ఉన్నా.. జగన్ ఏమీ సాధించకుండానే.. ఐదేళ్లు గడిపేశారు. ఇక, ఇప్పుడు మళ్లీ విపక్షంలోకి మారగానే.. మరోసారి రైల్వే జోన్, హోదాల జపం చేస్తున్నారు. తాజాగా పార్లమెంటులో మాట్లాడిన వైసీపీ ఎంపీ తనూజా రాణి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిలు ఈ రెండు అంశాలను ప్రస్తావించారు. టీడీపీ ఇప్పుడు ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ అని.. హోదాను సాధించుకునేందుకు ఇదే మంచి తరుణమని రాణి చెప్పారు.
రైల్వే జోన్ సుదీర్ఘ కాల డిమాండ్ అని.. దీనిని సాధించాలని.. వైవీ చెప్పుకొచ్చారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వీటిని ఇంత గట్టినా అడిగిన ధాఖలాలు లేకపోవడం గమనార్హం. కట్ చేస్తే.. ఇక్కడ మరో అంశం కూడా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం లోక్ సభలో వైసీపీకి నలుగురు ఎంపీలు, రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. అంటే.. మొత్తం15 మంది. ప్రస్తుతం టీడీపీకి ఉన్న బలం 16 మంది. వీరితో పోల్చితే.. వైసీపీకి, టీడీపీకి పెద్ద తేడా లేదు.
పైగా టీడీపీకి ఉన్న ఎంపీలు లోక్‌సభలో మాత్రమే. ఇక్కడ బీజేపీకి భారీ బలమే ఉంది. కానీ, వైసీపీకి ఉన్న 11 మంది రాజ్యసభలో ఉన్నారు. వీరి బలం బీజేపీకి లేకపోతే.. కీలక బిల్లులు ఆమోదం పొందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏవైతే.. వైసీపీ డిమాండ్ చేస్తోందో.. వాటి కోసం రాజ్యసభలో గట్టిగా పట్టుబడితే.. కేంద్రం దిగిరాక తప్పదు. మరి ఆ పని చేస్తుందా? అనేది ప్రశ్న. రైల్వే జోన్, ప్రత్యేక హోదా కోసం రాబోయే ఏదైనా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని.. వైసీపీ ప్రకటించగలదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎలా చూసుకున్నా.. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికార పక్షంలో ఉంటే మరోలా వ్యవహరించడం.. వైసీపీకి ఆనవాయితీగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.