Begin typing your search above and press return to search.

జగన్ ముందు 11...వెనక 40...డెసిషన్ తీసుకోవాల్సిందే !

ఇక వైసీపీకి 11 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపధ్యంలో జగన్ అసెంబ్లీకి వెళ్లరు అని ఒక ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   17 Jun 2024 9:26 AM GMT
జగన్ ముందు 11...వెనక 40...డెసిషన్ తీసుకోవాల్సిందే !
X

జగన్ విపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టడమే మేలు అని ప్రజాస్వామ్య ప్రియులతో పాటు మేధావులు సైతం కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో బ్యూటీ ప్రతిపక్షం కూడా సభలో ఉండడం అని అంటున్నారు. ఏపీలో కనీ వినీ ఎరుగని మెజారిటీతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 164 సీట్లతో అసెంబ్లీ అంతా కూటమి సభ్యులే ఉన్నారు.

ఇక వైసీపీకి 11 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపధ్యంలో జగన్ అసెంబ్లీకి వెళ్లరు అని ఒక ప్రచారం సాగుతోంది. కానీ జగన్ సభకు వెళ్లాల్సిందే అని అంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఎన్ని సీట్లు వచ్చాయన్నది ముఖ్యం కాదు అసెంబ్లీలో ఒక్కరు గెలిచినా విపక్ష పాత్ర పోషించాల్సిందే అని జగన్ కి సూచించారు.

దానికి ఆయన తమిళనాడులో కరుణానిధి జయలలిత ఉదాహరణలను కూడా చెప్పుకొచ్చారు. కేవలం ఏడు సీట్లు వచ్చినా కరుణానిధి ప్రతిపక్ష పాత్ర పోషించారని ఆ తరువాత ఎన్నికల్లో నాలుగు సీట్లు వచ్చినా జయలలిత కూడా అంతే స్థాయిలో అధికార పక్షాన్ని ఎదుర్కొన్నారు అని గుర్తు చేశారు. దీనిని బట్టి జగన్ సభకు వెళ్లడమే మంచిది అని ఆయనతో పాటు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మరో వైపు చూస్తే జగన్ ముందు 11 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కానీ ఆయన వెనక 40 శాతం ఓటు షేర్ ఉందని. మొత్తం కోటీ 32 లక్షల మంది ఓట్లేసిన జనం ఉన్నారని అంటున్నారు. ఈ జనాలు వైసీపీని సభలో చూడాలని అనుకుంటున్నారు అని చెబుతున్నారు. వైసీపీకి సాధారణ సభ్యుల వరస ఇస్తారా లేక మైకు ఇస్తారా లేక మాట్లాడనిస్తారా అన్నది అధికార పార్టీ వైఖరి బట్టి ఉంటుంది.కానీ సభకు హాజరు కావడం మాత్రం వైసీపీ చేతుల్లోనే ఉంటుంది అని అంటున్నారు

సభకు హాజరై అధికార పక్షాన్ని నిర్మాణాత్మకంగా ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలను ప్రస్థావిస్తూ జగన్ తన పాత్రను సమర్ధంగా పోషించాలని కోరుతున్నారు. జగన్ తానుగా చెప్పుకున్నట్లుగా ఆయనకు ఈ విపక్ష పాత్ర ఏమీ కొత్తది కాదు, 2014 నుంచి 2017 దాకా ఆయన మూడేళ్ల పాటు సభలో పోషించారు అని అంటున్నారు.

అయితే అప్పటికీ ఇప్పటికీ మార్పు ఏమిటి అంటే బలాబలాలలో తేడాలు ఉండడం అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే విపక్ష హోదా అన్నది వైసీపీకి టీడీపీ ఇవ్వదనే అంటున్నారు.1994లో కేవలం 26 సీట్లు సాధించి కాంగ్రెస్ విపక్ష హోదా కోల్పోయింది. ఆనాడు విపక్ష నేతగా ఉన్న పి జనార్ధనరెడ్డికి నాటి టీడీపీ ప్రభుత్వం విపక్ష నేత హోదా ఇవ్వలేదు ఇక కేంద్రంలో రెందు టెర్ములుగా కాంగ్రెస్ విపక్ష హోదాకు దూరంగానే ఉంది. వారికి కూడా హోదా బీజేపీ ఇవ్వలేదు. అదే సమయంలో ముందు వరసలో సీట్లు ఇచ్చి వారిని ప్రతిపక్షంగానే చూస్తూ వస్తోంది. చర్చ జరిగినపుడు విపక్షానికే మొదట మాట్లాడే చాన్స్ ఇస్తున్నారు.

మరి ఏపీలో అలా జరుగుతుందా అంటే ఇపుడున్న రాజకీయ వాతావరణంలో అది జరిగే పని కాదు, జగన్ ని కూడా సాధారణ సభ్యుడిగానే ట్రీట్ చేస్తారు. ఆయనకు మైకు ఇవ్వాలన్నది స్పీకర్ ఇష్టం బట్టి ఉంటుంది. కానీ ప్రతిపక్షం ఉంటేనే సభకు నిండుతనం కాబట్టి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.