Begin typing your search above and press return to search.

చిరంజీవిని కూటమి నేతగానే జగన్ చూస్తున్నారా?

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజంటే అభిమానులకు పండగనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   23 Aug 2024 6:29 AM GMT
చిరంజీవిని కూటమి నేతగానే  జగన్  చూస్తున్నారా?
X

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజంటే అభిమానులకు పండగనే చెప్పాలి. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. చిరంజీవి 69వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే... ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి మాత్రం విషెస్ రాలేదు!

అవును... గురువారం మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ వేధికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు "ఇంద్ర" సినిమా రీరిలీజ్ సందర్భంగా థియేటర్లు కళకళలాడాయి. ఈ సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ ఫ్యాన్స్ భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు, ఫ్లెక్సీలు కట్టారు, పోస్టులు పెట్టారు.

అయితే అనూహ్యంగా... ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నుంచి మాత్రం మెగాస్టార్ కు శుభాకాంక్షలు అందలేదు. దీంతో... ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. వాస్తవానికి జగన్ సీఎంగా ఉన్న సమయంలో... చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రతినిథుల బృందం ఏపీ సీఎంవోలో జగన్ ను కలిసి చర్చించింది.

ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ పెద్దలను జగన్ ట్రీట్ చేసిన విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై పవన్ తన ప్రసంగాల్లో పలుమార్లు ప్రస్థావిస్తూ జగన్ ది కుసంస్కారం అంటూ విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఈ విషయం ఓ సామాజికవర్గంలో బలంగా పాతుకుపోయిందనే కామెంట్లు వినిపించాయి.

దీంతో ఆ తర్వాత చిరంజీవిని సతీసమేతంగా జగన్ తన ఇంటికి ఆహ్వానించి కాస్త దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు అనిపించినా... అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనేది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలోనే 2019లో వైసీపీ వైపు నిలబడిన ఓ సామాజిక వర్గ ఓటర్లు.. ఈ సారి పూర్తిగా దూరం పెట్టారనే కామెంట్లు వినిపించాయి. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఇది కూడా ఓ కారణం అని అంటారు.

మరోపక్క... 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలకు చిరంజీవి మద్దతు పలికారు. ఇందులో భాగంగా తన తమ్ముడు పవన్, జనసేన నేతలతో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు తన మద్దతు ప్రకటించారు. వారిని గెలిపిస్తే అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందని వెల్లడించారు!

మరి అదే కారణామా.. లేక, ఇంకా ఏదైనా కారణం ఉందా అనేది తెలియదు కానీ.. ఎన్నికలు అయిన తర్వాత మెగాస్టార్ జరుపుకున్న మొదటి పుట్టిన రోజుకి జగన్ నుంచి శుభాకాంక్షలు అందలేదనే విషయం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది! దీంతో... జగన్ ఇప్పటికీ తప్పుమీద తప్పు చేస్తున్నారా అనే చర్చా తెరపైకి వస్తుంది!!