Begin typing your search above and press return to search.

ఏపీ అప్పుల కుప్ప అంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా ?

ఏపీలో ఎన్ని అప్పులు ఉన్నాయన్న సంగతి జనాలకు తెలియాల్సిందే. ఏ అంటే అప్పు అని ప్రచారం చేశారు గతంలో

By:  Tupaki Desk   |   27 July 2024 3:00 AM GMT
ఏపీ  అప్పుల కుప్ప అంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా ?
X

ఏపీలో ఎన్ని అప్పులు ఉన్నాయన్న సంగతి జనాలకు తెలియాల్సిందే. ఏ అంటే అప్పు అని ప్రచారం చేశారు గతంలో. ఏపీ ఇమేజ్ ని రాజకీయాల కోసం ఎవరు వాడుకున్నా అది తగని పని. ఎందుకంటే ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినడం ఖాయమని అంటున్నారు. ఇక ఏపీకి ఎన్ని అప్పులు ఉన్నాయన్న సంగతి ఇపుడు అధికారంలో ఉన్న కూటమి చెప్పాల్సిన బాధ్యత ఉంది.

ఎన్నికల్లో ఎన్నో అనుకుంటారు. అందులో రాజకీయ విమర్శలలో భాగంగా ఏపీ అప్పులు బారెడు అని ప్రచారం చేసినా ఎవరూ సీరియస్ గా తీసుకోరు. అదే అధికారంలో ఉన్న వారు ఏపీ ఆర్ధిక వ్యవస్థ భయంకరంగా ఉందని దివాళా తీసిందని రెగ్యులర్ బడ్జెట్ ని సైతం ప్రవేశపెట్టడానికి ఇబ్బందిగా ఉందని చెప్పడం వల్ల రాజకీయంగా మేలు జరిగితే జరగవచ్చు కానీ ఏపీ బ్రాండ్ ఇమేజ్ టోటల్ గా డేంజర్ లో పడుతుంది.

అప్పులు ఉన్న వాడి దగ్గరకు ఎవరూ వెళ్లరు, ఇది లోక రీతి. అంతే కాదు తప్పించుకుని తిరుగుతారు. నిజానికి చూస్తే దేశంలో ప్రతీ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి. ఆ మాటకు వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని గత పదేళ్ళుగా నడుపుతున్న ఎండీయే హయాంలో అప్పులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని కూడా విమర్శలు ఉన్నాయి.

అంత మాత్రం చేత ప్రతీ రోజూ అప్పుల భారతం అని విపక్షాలు ప్రచారం చేయడం లేదు, ప్రభుత్వం కూడా అప్పులు ఉన్నాయి కాబట్టి మేము ఇబ్బందులలో ఉన్నామని జనాలకు చెప్పుకోవడం లేదు. మరి ఎక్కడా లేని పరిస్థితి ఏపీకే ఎందుకు వస్తోంది అన్నదే చర్చగా ఉంది.

ఏపీలో రాజకీయం పతాక స్థాయికి చేరిపోయింది. అది హద్దులు దాటేసింది. అందువల్లనే రాష్ట్ర ప్రయోజనాలు కూడా మరచి రాజకీయ సయ్యాట చేస్తున్నారు. చంద్రబాబు ఎక్కువ అప్పులు చేశారని జగన్ అలాగే జగన్ హయాంలో ఆర్ధిక విధ్వంసం జరిగిందని చంద్రబాబు చెప్పుకుంటూ పోతే ఏపీలో రాజకీయ మైలేజ్ కోసం చూసుకున్నట్లుగా ఉంటుంది. అది వారికి బాగానే ఉండొచ్చు. కానీ బయట నుంచి చూసేవారికి ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది ఇబ్బందికరంగా మారుతుంది.

ప్రభుత్వం ఏ మాత్రం ఆర్ధిక సాయం అందించలేదని వారు ఒక నిర్ణయానికి వచ్చినపుడు ఏపీ వైపు ఎందుకు చూస్తారు. ఈ లాజిక్ ని అధికారంలో ఉన్న వారు కూడా అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఇక ఏపీ ప్రజలకు కూడా అప్పులు ఎన్ని ఉన్నాయని తెలియాల్సి ఉంది. నిజాయతీగా ఆ వివరాలు చెప్పాల్సి ఉంది.

ఎన్నికల్లో ఒక మాట గవర్నర్ ప్రసంగంలో మరో మాట, శ్వేత పత్రాల విడుదలలో మరో మాట చెబితే జనాలు ఎలా నమ్ముతారు. అధికారిక లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా. అందువల్ల ప్రజలకు జవాబు దారీగా ఉండేలా పూర్తి వివరాలతో ఏపీలో ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పడం మంచిది.

ఇక అప్పులు అన్నవి మరో వైపు చూసే సగటు మనిషికీ ఉంటాయి. అయితే అవి తీర్చగలిగే అప్పులా లేక రాష్ట్రాన్ని మింగేసే అప్పులా అన్నది కూడా తేటతెల్లం చేయాలి. తీర్చగలితే అప్పు ఉంటే మళ్లీ తెచ్చుకోవడానికి వీలు ఉంటుంది. అప్పు చేయడం తప్పు కాదు మితిమీరడం తప్పు అన్నది సామాన్యులకు కూడా తెలుసు.

ఇక ఏపీలో అప్పుల పేరు చెప్పి సంక్షేమ పధకాలను అమలు చేయకుండా అధికార కూటమి ఆపేస్తోంది అని వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు. ఈ విషయం జనాల్లోకి వెళ్తే అప్పుల బండ ప్రతిపక్షం మీద తోసి రాజకీయ లాభం పొందాలనుకుంటే అది బూమరాంగ్ అవుతుందని కూడా గ్రహించాలి.

అధికారంలో ఉన్న వారు బాధ్యతగా మెలగాలి. వారు ప్రజలకే జవాబుదారీ తప్ప మరెవరికీ కారు. ఈ సత్యం మరచిన గత ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి అయింది. అయిదేళ్ళ పాటు చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ పోయింది. చివరికి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టారు.

ఇపుడు కూడా ప్రజలు వైసీపీ వద్దు అనుకున్నది ఆ ప్రభుత్వం తప్పిదాలు చేసిందే. దానికి ప్రతీ రోజూ గత ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం లేదు. తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలు దగ్గర పడుతున్న వేళ పాలన గురించి ఆలోచన చేయాలి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమం గురించి ఆలోచన చేయాలని అంతా సూచిస్తున్నారు.

ఇక వైసీపీ అధినేత కూడా తన ప్రభుత్వం అప్పులు తక్కువ చేసింది అన్న దానిని మీడియా ముందుకు వచ్చి చెప్పడం కాకుండా అదే అసెంబ్లీలో చెబితే దానికి ఎక్కువ విలువ ఉంటుందని గ్రహించాలి. అంతే కాదు ప్రజల కోసం పోరాడాలి.ఏ సమస్య ఉన్నా అసెంబ్లీ వేదికగానే తేల్చుకోవాలని సూచనలు వస్తున్నాయి. మొత్తానికి ఏపీ అప్పుల కుప్ప అంటూ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయవద్దు అన్నదే మేధావుల నుంచి వస్తున్న సూచన.