అడ్డంగా దొరికిన బాబు...అందుకే జైలులో ఉన్నారు...నిప్పులు చెరిగిన జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబు రిమాండ్ మీద తొలి సారి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దోపిడీలు చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయకూడదా అని ఆయన ప్రశ్నించారు.
By: Tupaki Desk | 16 Sep 2023 7:44 AM GMTఎన్నో వెన్నుపోట్లు, మరెన్నో దోపిడీలు, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ చంద్రబాబు దొరకలేదు, ఇపుడు అడ్డంగా నిలువునా దొరికారు, అందుకే జైలులో ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబు రిమాండ్ మీద తొలి సారి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దోపిడీలు చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయకూడదా అని ఆయన ప్రశ్నించారు. నిడదవోలులో కాపు నేస్తం నాలుగవ విడత సొమ్ము లబ్దిదారుల ఖాతాలో జమ చేసిన అనంతరం జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ ఇన్నాళ్ళూ జరిగింది ఒక ఎత్తు, చట్టం అందరికీ ఒక్కటే అన్నది ఇపుడు బాబు అరెస్ట్ తో నిరూపితం కావడం మరో ఎత్తు అన్నారు.
ప్రజా ధనం కొల్లగొట్టినా అరెస్ట్ చేయకూడదు అంటారని ఇదెక్కిడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన వారు జైలులో ములాఖత్ పేరుతో మిలాఖత్ అవుతున్నారని పవన్ మీద మండిపడ్డారు. అవినీతి కేసులో బాబు అరెస్ట్ అయితే ఆయనతో పొత్తు పెట్టుకోవడమేంటని జగన్ మండిపడ్డారు.
మొత్తం 370 కోట్ల రూపాయలు ఎవరి జేబులలోకి వెళ్లాయని ప్రశ్నించాల్సిన వ్యక్తి జైలులో బాబుతో ములాఖత్ కావడమేంటని జగన్ అన్నారు. చంద్రబాబు రాజకీయం అంటే వెన్నుపోట్లు దోపిడీ తప్ప ఏముందని ఆయన నిగ్గదీశారు. పలుకుబడి కలిగిన దొంగలముఠా బాబుకు మద్దతు ఇస్తోందని ఆయన విమర్శించారు.
బాబు కోసం చెత్త పలుకు రోజూ రాసే వారంతా నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారని ఎల్లో మీడియా మీద జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు దోచుకున్న సొమ్ములో వాటాదారులు కావడం వల్లనే ఈ మద్దతు అని ఆయన సెటైర్లు వేశారు. వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు చేసిందేంటి అని ఆయన ప్రశ్నించారు.
ఆడియో వీడియో టేపులతో నల్లడబ్బు పంచుతూ అడ్డంగా దొరికిన నాడూ అరెస్ట్ కాలేదని అన్నారు. సాక్ష్యాధారాలతో సహా అన్నీ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో దబాయిస్తున్నారని అన్నారు. స్కిల్ స్కాం లో సూత్రధారి పాత్రధారి మొత్తం చంద్రబాబే అని ఆయన స్పష్టం చేశారు. ఐటీ నోటీసులు ఇచ్చిన ఈడీ నిందితులను అరెస్ట్ చేసినా కూడా బాబు బుకాయించడమేంటని జగన్ మండిపడ్డాతు. ఈ కేసులో ఫేక్ అగ్రిమెంట్ చేసుకున్న దొంగలను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసిందని జగన్ గుర్తు చేశారు.
డొల్ల సూట్ కేసు కంపెనీలకు ఈ నిధులను మళ్ళించారని ఈడీ నిగ్గు తేల్చిందని జగన్ చెప్పుకొచ్చారు. దోచుకోలేదని అంటున్న వారు 371 కోట్లు ఎక్కడికి పోయారో చెప్పగలరా అని ఆయన నిలదీశారు. ప్రజా ధనం పూర్తిగా కొల్లగొట్టిన చంద్రబాబుని కాకుండా ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయాలని ఆయన ప్రశ్నించారు.
ఎల్లో మీడియా నిజాలు కప్పిపుచ్చుతోందని, బాబు దోస్తులు అయితే ఆయంతో పొత్తులు అంటున్నారని, కానీ ప్రజలకు మాత్రం వాస్తవాలు తెలుసు అన్నారు. తనకు ప్రజలే అండ అని ఆయన చెప్పుకున్నారు. చంద్రబాబు మాదిరిగా తనకు బలమైన మీడియా అండ కానీ ఇతర శక్తుల అండ కానీ లేదని ఆయన అన్నారు.
టీడీపీ వారికి కండకావరం ఏంటి అంటే వారికి బలమైన మీడియా అండ ఉండడమే అని జగన్ ఒక్క లెక్కన విరుచుకుపడ్డారు. మొత్తానికి జగన్ బాబు అరెస్ట్ మీద రియాక్ట్ అయ్యారు. ఇన్నాళ్ళకు చట్టం తన పని తాను చేసుకుని పోయిందని అన్నారు. చట్టం చుట్టం కాదు అని తెలిసి వచ్చిదని బాబు మీద హాట్ కామెంట్స్ చేశారు.