దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో జగన్ కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజు రోజుకీ రచ్చ రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 15 Aug 2024 11:45 AM GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజు రోజుకీ రచ్చ రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ తన భార్య ఉండగానే, ఆమెకు విడాకులు కూడా ఇవ్వకుండా దివ్వెల మాధురి అనే ఆమెతో సహజీవనం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని దివ్వెల మాధురి సైతం ఒప్పుకున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించడానికి దువ్వాడ ఇంటికి వెళ్లిన ఆయన సతీమణి దువ్వాడ వాణి, కుమార్తెలపై దువ్వాడ శ్రీనివాస్ బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది.
గత కొన్ని రోజులుగా ఏపీ మీడియాలో దువ్వాడ వ్యవహారమే సీరియల్ లా నడుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉంటున్న దివ్వెల మాధురి సైతం టీవీ చానెళ్లకు, యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆయన ఇంటి ఎదురుగా నిరసనకు కూర్చున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పార్టీకి చెడ్డపేరు తెచ్చే ప్రమాదం కనిపించడంతో ఆయనను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే పార్టీకి కూడా రాజీనామా చేయాలని కోరనున్నట్టు సమాచారం.
దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుంటే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తారని అంటున్నారు. ఈ మేరకు జగన్ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల్లో ఉండేవారికి నైతిక విలువలు ఉండాలని, విశ్వసనీయత ఉండాలని పదే పదే జగన్ తన ప్రసంగాల్లో చెబుతుంటారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్సీనే భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో మహిళతో ‘అడల్ట్రీ’ వ్యవహారం నడుపుతుండటం, ఈ విషయాన్ని ఆయనతోపాటు మాధురి సైతం ఒప్పుకోవడంతో పార్టీ పరువు పోకుండా దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో ఆయనకు ‘సంబంధాలు’ ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వయంగా శాంతి భర్త మధుసూదనే ఈ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తాను విదేశాల్లో ఉన్నప్పుడు శాంతి తల్లయిందని.. తాను లేకుండా తన భార్య గర్భం దాల్చడానికి బిడ్డను కనడానికి కారణం ఎవరో డీఎన్‌ఏ పరీక్ష చేయాలని శాంతి భర్త డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇలా వరుసగా అనైతిక వ్యవహారాల్లో చిక్కుకుని పార్టీ పరువు తీస్తున్నవారిని ఉపేక్షించకూడదని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తప్పవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.