కాపులు నాతోనే... నా పక్కనే...జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
జగన్ ఫస్ట్ టైం కాపుల పూర్తి స్థాయిలో తాము చేసిన మేలు గురించి సోదాహరణంగా వివరిస్తూ మాట్లాడారు.
By: Tupaki Desk | 16 Sep 2023 9:44 AM GMTజగన్ ఫస్ట్ టైం కాపుల పూర్తి స్థాయిలో తాము చేసిన మేలు గురించి సోదాహరణంగా వివరిస్తూ మాట్లాడారు. నిడదవోలు సభలో ఆయన కాపులకు తమ ప్రభుత్వం ఎంత చేసిందీ చెప్పుకొచ్చారు. కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవిని తాను ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నానని జగన్ తెలిపారు. కాపు మహిళలు పేదరికంలో ఉండరాదనే కాపు నేస్తం పధకం ప్రారంభించామని ఆయన వెల్లడించారు.
చంద్రబాబు కాపులకు చేసిందేంటి అని జగన్ నిలదీశారు తాను చేసిన దానిలో బాబు పది శాతం కూడా చేయలేదని అన్నారు. కాపులను మోసం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి బాబుకు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. కాపులను నిలువునా బాబు వంచించారని జగన్ విమర్శించారు.
కాపులు మాత్రమే కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారిని కూడా ఉప మంత్రులుగా చేశామని అన్నారు. కుల మత వర్గ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ మేలు చేస్తున్నమని చెప్పారు. గత 52 నెలల కాలంలో రాష్ట్రంలో అక్షరాలా రెండు లక్షల 35 వేల కోట్ల రూపాయల నగదుని బటన్ నొక్కడం ద్వారా నేరుగా మహిళల ఖాతాలలో చేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.
తాను చేసిన మంచి ప్రతీ ఇంటిలో కనిపిస్తోందని జగన్ అన్నారు. తాను ఇచ్చిన ప్రతీ పధకం అందుకున్న వారే ఏపీలో ఉన్నారని కూడా అన్నారు. అందుకే తనకు ప్రజలే అండ దండలు అని గట్టిగా ప్రకటించారు. తనకు ప్రజలే సైనికులు అన్నారు. చంద్రబాబు మాదిరిగా ఎల్లో మీడియా దత్తపుత్రుడు అండ తనకు లేదని కానీ ప్రజల దీవెనలు దేవుడి ఆశీస్సులు పుష్కలంగా తనకు ఉన్నాయని జగన్ చెప్పడం విశేషం.
తాను మంచి చేశాను అని అనిపిస్తే కచ్చితంగా తనకు తోడుగా ఉండాలని ఆయన కోరారు. తన వైపు న్యాయం ధర్మం ఉన్నాయని వాటి బలంతోనే తాను ప్రజల కోసం పాటుపడుతున్నానని జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు తెలుసుకోవాలని జగన్ కోరారు. ప్రజలు మంచి వైపున ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు. మొత్తానికి జగన్ గోదావరి జిల్లాలో అందునా కాపుల జనాభా ఎక్కువగా ఉన్న చోట నిలిచి కాపులకు తాను ఏమి చేసింది తొలిసారిగా చెప్పారని అంటున్నారు. అంతే కాదు చంద్రబాబు కాపులను వంచించారని కూడా ఆయన ఎండగట్టారు.
రాజకీయంగా చైతన్యవంతమైన గోదావరి జిల్లాలలో కాపు నేస్తం పధకం నిధులను వుడుదల చేయడం కూడా వ్యూహాత్కమైనదే అంటున్నారు. కాపులకు వైసీపీ అండగా ఉందని చెప్పడం కూడా అందులో భాగమని అంటున్నారు. మరి జగన్ కాపు కార్డుని తీసిన నేపధ్యంలో గోదావరి జిల్లాల రాజకీయ గమనం ఎలా ఉంటుంది, విపక్షాలకు ఏ విధంగా ఏ విధంగా వైసీపీ చెక్ పెడుతుంది అన్నది చూడాల్సి ఉంది.