పవన్ "కల్యాణం"లపై జగన్ సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పెళ్లిల్లపై వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు వివాహ వ్యవస్థ అంటే గౌరవం లేదని విమర్శించారు.
By: Tupaki Desk | 12 Oct 2023 9:14 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చెపట్టిన జగనన్న కాలనీలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇప్పటికే 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెబుతున్నారు జగన్. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అవును... సామర్ల కోటలో నిర్మించిన జగనన్న కాలనీని వైఎస్ జగన్ తాజాగా ప్రారంభించారు. ఈ సమయంలో రాష్ట్రంలో సొంత ఇల్లు లేనివాళ్లు ఉండరాదని, అదే తన సంకల్పం అని జగన్ చెప్పారు. ప్రతి చెల్లీ, ప్రతి అక్కా తన పిల్లాపాపలతో సొంత ఇంటిలో ఉండాలని, దానికి తనవంతుగా గొప్ప సాయం అందించాలని నిర్ణయించానని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 80 శాతం ఇళ్లు పూర్తిచేశామని తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు ఏపీలోనే ఇళ్లు ఉంటాయని, విపక్ష నేతలకు మాత్రం పక్క రాష్ట్రంలో ఇళ్లు ఉంటయన్నట్లుగా ఎద్దేవా చేసిన జగన్... చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరని.. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉందని.. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని అన్నారు.
ఈ సందర్భంగా వీళ్లంతా ఏపీలో దోచుకుని.. హైదరబాద్ లో పంచుకుంటారనే విషయం ప్రజలంతా ఆలోచన చేయాలని జగన్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పెళ్లిల్లపై వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు వివాహ వ్యవస్థ అంటే గౌరవం లేదని విమర్శించారు.
ఇందులో భాగంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్ లో ఉంటుంది అని చెప్పిన జగన్... ఇల్లాలు మాత్రం ప్రతీ మూడునాలుగేళ్లకూ మారిపోతుందని అన్నారు. ఇదే సమయంలో మొదట్లో లోకల్, తర్వాత నేషనల్, ఇప్పుడు ఇంటర్నేషనల్ అని కామెంట్ చేసిన జగన్... తర్వాత ఎక్కడికి పోతాడో అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇక పవన్ కల్యాణ్ రాజకీయంపైనా జగన్ ఫైరయ్యారు. సరుకులను అమ్ముకునే వాళ్లనూ చుశాం, సరంజామా అమ్ముకునేవాళ్లనూ చూశాం అని చెప్పిన జగన్... సొంతపార్టీని, సొంతవర్గాన్ని వేరేవారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తున్నామని మండిపడ్డారు. రెండు షూటింగుల మధ్య విరామంలో అప్పుడప్పుడూ వచ్చిపోతాడని.. ఏపీకి అప్పుడప్పుడూ వచ్చీ ఇలాంటి వ్యాపారం చేసే వ్యక్తికి... మన కాపులపైనా, సమాజంపైనా ఏమి ప్రేమ ఉంటుందో ఆలోచించమని తెలిపారు.
పవన్ కల్యాణ్ కు భీమవరంతో కానీ, గాజువాకతో కానీ ఎలాంటి అనుబంధం లేదని జగన్ తెలిపారు. వీరందరికీ అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడానికి కాదని.. కేవలం, దోచుకున్నది హైదరాబాద్ లో పంచుకోవడానికి మాత్రమే అని జగన్ ఫైరయ్యారు. వీరంతా మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు అంటూ జగన్ మండిపడ్డారు.