విశాఖ హార్బర్ లో అగ్నిప్రమాదం... తెరపైకి జగన్ మార్క్ సహాయం!
ఈ సమయంలో ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఈ ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు భారీ సహాయం ప్రకటించారు.
By: Tupaki Desk | 20 Nov 2023 5:18 PM GMTవిశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తీవ్ర ఆస్తినష్టం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాధంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఈ ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు భారీ సహాయం ప్రకటించారు.
అవును... విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ సహాయం ప్రకటించారు. ఇందులో భాగంగా... దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా అందించాలని ఆదేశించారు. ఈ మేరకు ఈ ఘటనపై సోమవారం ఉదయం జరిగిన సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.
అంతకుముందు.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు సహా జిల్లా కలెక్టర్, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు పూర్తి భరోసానిచ్చినట్లు వివరించారు. ఈ ప్రమాదంలో సుమారు 36 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇదే సమయంలో ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ప్రమాధంలో రూ. 12 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టుగా తుది నివేదిక సిద్ధంచేసినట్లు తెలుస్తుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి... ఈ అగ్ని ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బ అని.. ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవితాలను నిలబెటాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో వారి సహాయం విషయంలో అత్యంత మానవతాధృక్ఫధంతో వ్యవహరించాలని తెలిపారు. మానవత్వం అనే పదానికి అర్ధం చెప్పేలా ఈ సాయం ఉండాలని జగన్ సూచించడం గమనార్హం.
ఇదే సమయంలో దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా ఇవ్వాలని ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్... బోట్లకు ఇన్సూరెన్స్ లేదనో.. లేక, మరో టెక్నికల్ రీజనో చూపి వారి జీవితాలను గాలికి వదిలేయడం సరికాదు అని చెప్పారు. ఇలాంటి కష్టం కాలంలో వారికి పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందని అధికారులకు స్పష్టం చేశారు.
కాగా... విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో బోట్లు దగ్ధమైన ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్థాయిలో జగన్ భారీ సహాయం ప్రకటించారు. ఈ సహాయంపై మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలుస్తుంది.