జగన్ పవన్ చంద్రబాబు ఒకే చోట..!?
జగన్ చంద్రబాబు అసెంబ్లీలో అయినా ఒకరికొకరు ఎదురుపడ్డారు కానీ పవన్ తో అయితే జగన్ ఎపుడూ కలిసింది లేదు.
By: Tupaki Desk | 17 Jan 2024 5:20 PM GMTఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురూ కలసి కనిపించినది ఎపుడూ లేదు. జగన్ చంద్రబాబు అసెంబ్లీలో అయినా ఒకరికొకరు ఎదురుపడ్డారు కానీ పవన్ తో అయితే జగన్ ఎపుడూ కలిసింది లేదు.
ఇక రాజ్ భవన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ తిరిగి రిపబ్లిక్ దినోత్సవ వేళ రెండు సందర్భాలలో జరిగే గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి కూడా మూడు పార్టీల అధినేతలు వచ్చింది లేదు. ఒకసారి మాత్రం జగన్ చంద్రబాబు వచ్చారు కానీ ఎదురు పడలేదు.
ఇలా ఉంటే ఇపుడు ఈ ముగ్గురూ కలిసే అరుదైన సందర్భం వస్తోందా అంటే జవాబు అవును అనే అంటున్నారు. జగన్ సోదరి వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధ వేడుకను ఘనంగా ఈ నెల 18న నిర్వహిస్తున్నారు. ఈ వేడుక కోసం ఆమె ఇప్పటికే ప్రముఖులను కలుస్తూ కుమారుడి శుభలేఖ అందించి, నిశ్చితార్థంతో పాటు పెళ్లికి కూడా రావాలని ఆహ్వానిస్తున్నారు. రాజారెడ్డి-అట్లూరి ప్రియ నిశ్చితార్థం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ వేదికగా చేస్తున్నారు.
ఇక తన మేనల్లుడి వివాహ నిశ్చితార్ధ వేడుకలలో పాల్గొనేందుకు సీఎం జగన్ కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఈ నెల 18వ తేదీ సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి హైదరాబాద్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన గోల్కొండ రిసార్ట్స్ కి చేరుకుని ఆ వేడుకలో పాలుపంచుకుంటారు. అనంతరం రాత్రికే తిరిగి తాడేపల్లికి వస్తారు అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఈ వేడుకకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం కచ్చితంగా ఈ ముగ్గురు నేతలు ఒకే వేదిక వద్ద కలుసుకునే అరుదైన రికార్డు అవుతుందని అంటున్నారు. ఏపీలో ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ కీలకమైన ముగ్గురు నేతలు ఇలా కలుసుకోవడం అంటే రాజకీయంగా అది చర్చనీయాంశమే అని అంటున్నారు.