జగన్ కి ప్రాణహాని...హైకోర్టులో పిటిషన్
ఇపుడు జగన్ కొత్తగా తనకు భద్రత పెంచాలంటూ హైకోర్టు ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే జగన్ కు భద్రత తగ్గించారన్న వాదనలను పోలీసు శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తున్నాయి.
By: Tupaki Desk | 5 Aug 2024 3:51 PM GMTమాజీ సీఎం వైఎస్ జగన్ తనకు ప్రాణ హాని ఉందని ఏకంగా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తనకు తగిన భద్రతను రక్షణను కల్పించకుండా ఉద్దేశ్యపూర్వకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తనకు ఇచ్చే సెక్యూరిటీని బాగా తగ్గించింది అని జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ ని విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఇదిలా ఉంటే జగన్ సీఎం గా దిగిపోయే నాటికి ఆయనకు 900 మందితో బలమైన భద్రత ఉండేది. దానిని జూన్ 3తో తొలగించారు. కొత్త ప్రభుత్వం ఆ తరువాత ఏర్పడింది. ఈ క్రమంలో తనకు తగిన భద్రత లేదని తనకు ప్రాణ హాని ఉందని భావిస్తూ జగన్ న్యాయస్థానం ముందుకు వచ్చారు.
అంతే కాదు కావాలనే ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం తనకు ఉన్న భద్రతను తొలగించింది అని ఇదంతా తనను భౌతికంగా అంతమొందించే లక్ష్యంతోనే అని జగన్ తీవ్రమైన అనుమానం తో కూడిన ఆరోపణలను పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ప్రాణ హాని ఉన్న విషయాన్ని పరిశీలించకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఇది తగదని జగన్ ఆ పిటిషన్ లో తెలిపారు.
తనకు వ్యక్తిగత భద్రతను మరింత గా పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇదిలా ఉంటే కాగా, జూన్ 3వ తేదీ నాటికి జగన్ కి ఉన్న పూర్తి భద్రతను ఇపుడు కూడా కొనసాగించాలని ఆ పిటిషన్ లో ఆయన తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. అంతే కాదు జగన్ కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని తెలిపారు.
నిజానికి జగన్ విషయం చూస్తే ఆయన మాజీ సీఎం గా ఉన్నారు. ప్రతిపక్ష నేత హోదా అయితే లేదు. దాంతో ఆ హోదా ఉంటే పూర్తి భద్రత తో పాటు ప్రోటోకాల్ వంటివి ఉండేవి. ప్రతిపక్ష హోదా విషయంలోనూ జగన్ హైకోర్టుని ఆశ్రయించారు. దాని మీద విచారణ జరుగుతోంది.
ఇపుడు జగన్ కొత్తగా తనకు భద్రత పెంచాలంటూ హైకోర్టు ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే జగన్ కు భద్రత తగ్గించారన్న వాదనలను పోలీసు శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తున్నాయి. అన్ని రకాలుగా చూసినా పూర్తి నిబంధన మేరకే జగన్ కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.ప్రస్తుతానికి జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని తెలిపాయి.
అయితే జగన్ సీఎం గా ఉన్నపుడు ఆ హోదాలో కల్పించే అదనపు భద్రతనే ఇపుడు కుదించామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జగన్ కి ఇపుడు కూడా సీఎం హోదాలో కల్పించే భద్రత ఇవ్వాలంటే కుదరదని అంటున్నాయి.
మరి ఈ పిటిషన్ మీద హైకోర్టు ఏ విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తుంది అన్నది చూడాలి. హోదాతో సంబంధం లేకుండా చాలా సందర్భాల్లో ప్రాణ హాని ఉందని అంటే భద్రతను పెంచమని పేర్కొన్న ఉదంతాలు ఉన్నాయి. అయితే ప్రాణ హాని ఉందా లేదా అన్నది నిర్దారించాల్సి ఉంటుంది.
అదే విధంగా చూస్తే ఒక మాజీ సీఎం కి కల్పించే భద్రత విషయంలో నిబంధనలు ఏమిటి అన్నది కూడా చూస్తారని అంటున్నారు. మొత్తానికి జగన్ ప్రాణ హాని ఉందని చెప్పడం మాత్రం సంచలనంగా మారింది. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత పార్టీ మొత్తం ఒక విధంగా నైరాశ్యంలో పడిపోయింది. ఇపుడు అధినేత తనకే ప్రాణ హాని అంటున్నారు.