జగన్ ఇంటి వద్ద అంత ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెట్టుకున్న ఆశలు అడియాసలైన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 17 Jun 2024 9:49 AM GMTఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెట్టుకున్న ఆశలు అడియాసలైన సంగతి తెలిసిందే. అధికారం సంగతి దేవుడెరుగు చివరకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కనంత స్థాయికి వైసీపీ పతనమైంది.
ఇప్పుడు వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. ప్రతిపక్ష నేత హోదా ఉంటే కేబినెట్ మంత్రికి సమానంగా సెక్యూరిటీ, హోదాను అందుకునేవారు. అయితే ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్ కేవలం ఎమ్మెల్యే స్థాయికే ఇప్పుడు పరిమితమయ్యారు.
ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం జగన్ ఇంటి వద్ద గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని తొలగించింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ భద్రత కోసం గతంలో భారీ ఎత్తున పోలీసు సిబ్బంది, తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద ప్రత్యేకంగా పోలీస్ చెక్ పోస్టులు ఉండేవి. బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. తద్వారా రోడ్లను మూసేసి ప్రజల రాకపోకలను అడ్డుకున్నారు.
అయితే ఇప్పుడు జగన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమే కావడంతో వాటన్నింటిని చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. దీంతో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తన తాడేపల్లి నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. దాదాపు 30 మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది రంగ ప్రవేశం చేశారు. వారంతా తాజాగా జగన్ ఇంటిలోపలకు వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద పోలీసు సిబ్బందిని, బారికేడ్లను, చెక్ పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం తొలగించడంతో ప్రజలకు ఇన్నాళ్లూ మూసేసిన రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దూరాభారం తప్పింది.
దీంతో ఆ రోడ్డు ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు అందుబాటులోకి వచ్చింది.
కాగా ఒక ప్రముఖ ప్రైవేటు ఏజెన్సీ నుంచి 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని జగన్ నియమించుకున్నట్టు తెలుస్తోంది. బులుగు రంగు సఫారీ డ్రస్సులు ధరించినవారు జగన్ నివాసంలోకి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.