Begin typing your search above and press return to search.

పింఛ‌న్లు పెంచుతా.. సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌ళ్లీ అధికారంలోకి రాగానే ప్ర‌స్తుతం ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను మ‌రింత పెంచ‌నున్న‌ట్టు సీఎం జ‌గ‌న్ చెప్పారు.

By:  Tupaki Desk   |   3 Feb 2024 12:52 PM GMT
పింఛ‌న్లు పెంచుతా.. సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ
X

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌ళ్లీ అధికారంలోకి రాగానే ప్ర‌స్తుతం ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను మ‌రింత పెంచ‌నున్న‌ట్టు సీఎం జ‌గ‌న్ చెప్పారు. అంతేకాదు.. ఇప్పుడు ఇస్తున్న పింఛ‌న్లు, అమ్మ ఒడి, ఆస‌రా, చేదోడు, వాహ‌న‌మిత్ర, విద్యాదీవెన, వ‌స‌తి దీవెన వంటి అనేక ప‌థ‌కాలు.. ఆగిపోకుండా ఉండాలంటే.. వైసీపీని ఆశీర్వ‌దించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా నిర్వ‌హించిన 'సిద్ధం' స‌భ‌లో సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగించారు. ఆసాంతం ఆయ‌న చాలా హుషారుగా ప్ర‌సంగం చేయ‌డం గ‌మ‌నార్హం. ఎక్క‌డా త‌డ‌బాటు లేకుండా ప్ర‌సంగం చేయ‌డం మ‌రింత విశేషం.

చంద్ర‌బాబుపై స‌టైర్లు..

సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై స‌టైర్లు వేశారు. ''ఆ పెద్ద‌మ‌నిషి.. చంద్ర‌బాబు ఊరూరా తిరుగుతూ స‌భ‌లు నిర్వ‌హిస్తున్నాడు. రా..క‌ద‌లిరా! అంటూ పిలుస్తున్నాడు. కానీ, ఆయ‌న పిలుస్తున్న‌ది ప్ర‌జ‌ల‌ను కాదు. పార్టీల‌ను. రండి క‌ద‌లి రండి.. నాకు మ‌ద్ద‌తివ్వండి.. అని పిలుస్తున్నాడు. ఆయ‌న ఏనాడూ పొత్తు లేకుండా ఎన్నిక‌లకు వెళ్ల‌లేదు. ఈసారి ముగ్గురిని పిలుస్తున్నాడు. ఆయ‌న వ‌దిన‌, బీజేపీ నాయ‌కురాలిని పొత్తు కోసం పిలుస్తున్నాడు. రా..క‌ద‌లిరా! అంటున్నారు. ఇంకోవైపు గ్లాసు పార్టీని కూడా పిలుస్తున్నాడు. రా..క‌ద‌లిరా! నేను ప్యాకేజీ ఇస్తాను. అని అంటున్నాడు'' అని జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు.

ఇక‌, కాంగ్రెస్ గురించి కూడా జ‌గ‌న్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభ‌జించి.. తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొంద‌రు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఏపీ ప్ర‌జ‌ల‌ను ప‌చ్చిద‌గా చేసిన పార్టీకి కొమ్ము కాస్తున్నారు. వారు వ‌చ్చి కొన్ని ఓట్లు చీలిస్తే.. త‌నకు మేలు జ‌రుగుతుంద‌ని ఈ పెద్ద మ‌నిషి చంద్ర‌బాబు చూస్తున్నారు. వైఎస్సార్ పేరును అన్యాయంగా చార్జిషీటులో ఇరికించిన పార్టీని బ‌లోపేతం చేయాల‌ని చూస్తున్నారు. అందుకే ఆ పార్టీని కూడా రా.. క‌ద‌లిరా! అంటూ పిలుస్తున్నాడు.. అని జ‌గ‌న్ అన్నారు.

సీఎం జ‌గ‌న్ త‌న స‌టైర్ల పరంప‌ర‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబును చంద్ర‌ముఖితో పోల్చారు. జ‌న‌సేన అధినేత పేరు ఎత్త‌కుండా.. టీ-గ్లాసు అంటూ సంభోదించారు. ఈ ఇద్ద‌రూ వ‌చ్చేస్తార‌ని, ఏదోదే చెబుతార‌ని అన్నారు. ''చంద్ర‌ముఖి .. టీ గ్లాసు ప‌ట్టుకుని సైకిల్ ఎక్కుతుంది. ల‌క‌ల‌క‌లక‌ అంటూ..పేద‌ల ర‌క్తం తాగేందుకు ప్రతి ఇంటికీ వ‌స్తుంది. ఒక డ్రాకులా మాదిరిగా మీ త‌లుపు త‌డుతుంది. జాగ్ర‌త్త‌'' అని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. చంద్ర‌ముఖి సినిమా చూశారా? అంటూ.. స‌భ‌కు వ‌చ్చిన వారిని ప్ర‌శ్నించారు.