బాబూరావుకు పెద్దల పీఠం.. గేర్ మార్చిన సీఎం జగన్
వైసీపీకి తప్పకుండా ఓటేస్తారని భావించిన ఎమ్మెల్యేలకు ఎస్సీ నాయకుడు, ప్రస్తుతం పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబూరావును అప్పగించినట్టు తెలిసింది.
By: Tupaki Desk | 8 Feb 2024 12:30 PM GMTఏపీలో ఈ నెల 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత సీఎం జగన్ వ్యూహం మార్చుకున్నారు. మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ మూడు కూడా తమకే దక్కుతా యని అంచనా వేసుకున్నా.. తేడా వస్తే.. అంటే.. అసంతృప్త ఎమ్మెల్యేలు.. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే.. ఒక సీటు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. ఈ పార్టీ కూడా.. అభ్యర్థిని ఎంపిక చేస్తోంది. ఈ నేపథ్యంలో జాగ్రత్త పడిన సీఎం జగన్. ముందు ఇద్దరు ఎస్సీలకు అవకాశం ఇవ్వాలని అనుకున్నా.. దీనిని విరమించుకుని. .ఒక ఎస్సీ, రెండు రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టారు.
తాజా వ్యూహంలో భాగంగా.. వైసీపీకి తప్పకుండా ఓటేస్తారని భావించిన ఎమ్మెల్యేలకు ఎస్సీ నాయకుడు, ప్రస్తుతం పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబూరావును అప్పగించినట్టు తెలిసింది. ఇక, మిగిలిన రెండు స్థానాలను మాత్రం హోల్డ్‌లో పెట్టారు. ఈ ఎన్నికల్లో విప్ జారీ చేసినా.. అభ్యర్థులు తాము ఓటు వేయబోయే వారి రసీదును పార్టీ ఎంపిక చేసిన ప్రతినిధికి చూపించినా(ఈ నిబంధనలు రాజ్యసభ ఎన్నికల్లో ఉన్నాయి) చివరి నిముషంలో మార్పు జరిగితే చేసేది ఏమీ ఉండదు. ఈ నేపథ్యంలో ఎస్సీ నాయకుడు గొల్లకు ఇబ్బంది లేకుండా.. ఆయనను గెలిపించేందుకు పక్కా వ్యూహం ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది.
తాజాగా ఖాళీ అయిన స్తానాల్లో మాజీ ఎంపీ, వైసీపీ కీలక నాయకుడు, సీఎం జగన్‌కు స్వయానా చిన్నాన్న అయిన వైవీ సుబ్బారెడ్డి, మరో నేత మేడా రాఘునాథ్ రెడ్డికి కేటాయించారు. ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేశ్ ల పదవీ కాలం ఏప్రిల్ తో ముగియనుంది. ఇక, బలాల వారీగా చూసుకుంటే.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి ఈ మూడు గెలుచుకోవడం ఇబ్బంది కాదు. కానీ , రెబల్ ఎమ్మెల్యేలతోనే ఇబ్బందులు ఉన్నాయి.
సామాజిక సమీకరణాలతో పాటు ప్రాంతీయ లెక్కలు వేసుకున్న తర్వాత సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి అభ్యర్థిత్వానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. రెడ్డి వర్గంలో ఒకరు ఓడినా.. ఎస్సీ వర్గానికి చెందిన గొల్ల గెలిచి తీరాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనినిచూపించి.. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవాలన్నది సీఎం జగన్ ఆలోచనగా ఉందని అంటున్నారు.