జగన్ రాజీనామా చేస్తారా? దుమ్ము రేపుతున్న సోషల్ మీడియా
ఇదొక సంకట స్థితి అయితే.. మరో వైపు.. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి మరింతగా వైసీపీ అధినేతను వేధిస్తోంది.
By: Tupaki Desk | 8 July 2024 4:35 AM GMTఏపీ మాజీ సీఎం జగన్ తన పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయనున్నారా? ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారా? ఏపీలోనేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమ్మురేపుతున్న రాజకీయ చర్చ ఇదే కావడం గమనార్హం. దీనిలో నిజా నిజాలు ఎలా.. ఉన్నప్పటికీ.. ప్రస్తుతం జగన్ ఉన్న పరిస్థితిని గమనిస్తున్నవారు.. చేసినా చేయవచ్చని చెబుతుండడం గమనార్హం. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. ఇది ఊహించని దెబ్బగానే వైసీపీ నాయ కులు భావిస్తున్నారు. ప్రజలకు ఎన్నో మేళ్లు చేశామని చెప్పిన వైసీపీ.. ఇలా ఘోర పరాజయం మూటగట్టుకోవడాన్నివారు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఇదొక సంకట స్థితి అయితే.. మరో వైపు.. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి మరింతగా వైసీపీ అధినేతను వేధిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సుదీర్ఘ లేఖ రాశారు. సంఖ్యా బలంతో సంబంధం లేకుండా తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు. కానీ, దీనిపై నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అయితే.. జగన్‌కు సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశించే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే.. ప్రజలే 11 స్థానాలు ఇచ్చి.. పక్కన కూర్చోబెట్టిన వైసీపీని ఇప్పుడు అధికార పక్షం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే.. రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది.
ఈ నేపథ్యంలో జగన్ ఆశలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. మరి .. అలాగని జగన్ కూడా అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఠీవీగా అడుగు పెట్టిన సభలో ఇప్పుడు బిక్కు బిక్కు మంటూ.. తన 10 మంది ఎమ్మెల్యేల తో కూర్చుని.. అధికార పక్షం ఇచ్చే సమయం కోసం వేచి ఉండే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజం ఉండే ఉంటుందని అనడానికి ఇది బలమైన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎలానూ రాజకీయం చేసే అవకాశం, పరిస్థితి కూడా వచ్చే ఐదేళ్లూ కనిపించని నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లడమే ఉత్తమమని జగన్ భావించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.
ఈ కారణంగానే జగన్ తన పులివెందుల సీటుకు రాజీనామా చేయడం ద్వారా.. పార్లమెంటుకు పోటీ చేసేందుకు సిద్ధమవుతు న్నట్టు వస్తున్న ప్రచారానికి బలం చేకూరింది. కడప ఎంపీగా ఉన్న అవినాష్‌రెడ్డిని తప్పించి.. ఉప ఎన్నికలో జగన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తద్వారా వచ్చే ఐదేళ్లు కూడా.. జగన్ ఢిల్లీ రాజకీయాలకే పరిమితమై.. ఏపీలో పార్టీ పగ్గాలను కుటుంబంలోని వారికి అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. ఏదేమైనా.. ఈ విషయంలో వైసీపీ నాయకులు ఖండించకపోవడం.. మరోవైపు.. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఎదురీత గా మారుతుండడంతో ఏమైనా జరగొచ్చని అంటున్నారు పరిశీలకులు.