సంక్రాంతి వేళ.. `175` వంటకాలతో జగన్ విందు!
తెలుగు వారి సంప్రదాయ పండుగ సంక్రాంతి తొలిరోజు భోగి పండుగ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ధవళ వస్త్రాల్లో(వైట్) మెరిసిపో యారు.
By: Tupaki Desk | 15 Jan 2024 10:06 AM GMTతెలుగు వారి సంప్రదాయ పండుగ సంక్రాంతి తొలిరోజు భోగి పండుగ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ధవళ వస్త్రాల్లో(వైట్) మెరిసిపో యారు. సంప్రదాయ వస్త్ర ధారణతో చూపరులను కట్టి పడేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు.. తమ కళలను ప్రదర్శించారు. భోగి మంటలు రాజేసిన సీఎం దంపతులు.. ప్రాంగణంలో కలియ దిరుగుతూ అందరినీ పేరుపేరునా పలకరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలు దేవాలయాల నమూనాలను ఏర్పాటు చేశారు. తిరుమ ల తిరుపతి దేవస్థానం నమూనా అందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా కాణిపాకం వినాయకస్వామి ఆలయం కూడా మంత్ర ముగ్ధులను చేసింది. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన సీఎం దంపతులు.. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ కార్యక్రమాలను చంద్రగిరి ఎమ్మెల్యే పార్టీ ముఖ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నీ తానై నిర్వహించా రు. సుమారు 200 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ మొత్తం కార్యక్రమంలోనూ సీఎం జగన్ ఎంతో ఆకర్షణగా కనిపించారు. దివంగత వైఎస్ ను మరిపించేలా.. ఠీవీగా నడుస్తూ.. పరిసరాలను పరికించారు. హరిదాసుల నృత్యాలు, గంగిరెద్దుల దీవెనలు.. ఆసాంతం సంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేశాయి. తాడేపల్లిలోని గోశాలలో ప్రత్యేకంగా గోపూజలు నిర్వహించారు. అనంతరం.. 175 రకాల సంప్రదాయ పిండి వంటలతో అతిథులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో స్వయంగా సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ఆసాంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సీఎం జగన్‌కనిపించడం గమనార్హం. వాస్తవానికి ఎన్నికల సమయం కావడం, అభ్యర్థుల ఎంపిక చేపట్టిన నేపథ్యంలో సీఎం జగన్ ఇటీవల కాలంలొ బిజీబిజీగా కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఉల్లాసంగా కనిపించడం అందరనీ ఆకట్టుకుంది.