Begin typing your search above and press return to search.

బాబుని వదలనంటున్న జగన్ !

పైగా బాబు సంపద సృష్టించే సంక్షేమం అమలు చేస్తామని కమిట్ అయ్యారు.

By:  Tupaki Desk   |   10 Aug 2024 5:30 PM GMT
బాబుని వదలనంటున్న జగన్ !
X

ఏపీ సీఎం చంద్రబాబుకు హానీమూన్ పీరియడ్ టైం కూడా ఇవ్వను అంటున్నారు వైసీపీ అధినేత జగన్. దానికి కారణం బాబు రాజకీయంగా కొత్త వారు కాదు అనుభవం నిండా పండిన వారు కాబట్టే అంటున్నారు. పైగా బాబు సంపద సృష్టించే సంక్షేమం అమలు చేస్తామని కమిట్ అయ్యారు. దాంతో దాన్నే పట్టుకున్నారు జగన్.

ఆరు నూరు అయినా చంద్రబాబు తాను చెప్పినట్లుగా పథకాలు అమలు చేసి తీరాల్సిందే అని జగన్ డిమాండ్ చేస్తున్నారు. తల్లికి వందనం పధకం కింద ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలు వంతున ఎంతమంది విద్యార్ధులు ఒక ఇంట్లో ఉంటే అందరికీ పధకం వర్తింపచేయాలని కోరారు.

అలాగే రైతు భరోసా కింద ప్రతీ రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్ధిక సాయం చేయాల్సిందే అని అంటున్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కింద గత రెండు క్వార్టర్స్ లో పెండింగులో పెట్టిన మొత్తాలను విడుదల చేయాలని కోరుతున్నారు.

అంతే కాదు విద్యార్ధులకు వసతి దీవెన పథకం అమలు చేయడం లేదని, సున్నా వడ్డీ పథకం లేనే లేదని జగన్ విమర్శిస్తున్నారు. ఇక ఏపీలో 18 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారని ఈ రోజు వరకూ ఆ వూసే లేదని హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు నిరుద్యోగ భృతి కింద యువతకు మూడు వేల రూపాయలు ప్రతీ నెలా ఇస్తామని అన్నారని, అలాగే, ప్రతి ఇంటికీ ఉద్యోగం, మత్స్యకార భరోసా, పంటలకు ఉచిత బీమా ఇవన్నీ చంద్రబాబు అమలు చేసి తీరాల్సిందే అని జగన్ అంటున్నారు.

చంద్రబాబు ఏపీకి 14 లక్షల కోట్ల అప్పు ఉందని ఎన్నికల ముందర ప్రచారంలో చెప్పారని జగన్ గుర్తు చేశారు. అయినా సరే చంద్రబాబు తాను ఏపీలో అన్ని పధకాలు ఇస్తామని సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టి ఓట్లేయించుకున్నారని అన్నారు. తీరా అధికారం చేతిలో పడ్డాక అన్నీ తప్పుడు విషయాలను చేర్చి శ్వేతపత్రాలు అంటూ జనాలను మభ్యపెడుతున్నారని జగన్ మండి పడ్డారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం నుంచే మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు బాబు ఇచ్చిన హామీలను నమ్మి ఓటేశారని వాటిని వెంటనే నెరవేర్చాలని ఆయన అంటున్నారు. ప్రజలు ఎన్నో హామీలు ఇచ్చి ఇపుడు తప్పించుకోవాలని బాబు చూస్తున్నారని ఆయనది నయ వంచన అని జగన్ ఫైర్ అయ్యారు.

ఏపీలో లక్షల మంది వాలంటీర్లను మోసం చేశారని, అలాగే ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే విధానం ఆగిపోయిందని జగన్ అన్నారు. ఇక ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చే విధానం నిలిచిపోయింది. మధ్యాహ్న భోజన పథకంలో రోజుకో మెనూ విధానంగా చేస్తూ మొత్తం మార్చేశారు అని ఆయన ఆరోపించారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యాకానుక కిట్ల పంపిణీ అరకొరగా సాగుతోందని అన్నారు.

ఏపీలో టోటల్ గా లా అండ్ ఆర్డర్ కట్టు తప్పాయని రెడ్ బుక్ రాజ్యాంగమే టీడీపీది అయిందని అన్నారు ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలు ఆపేసి సూపర్ సిక్స్ హామీలను చెప్పిన మాటల మేరకు ప్రతీదీ తుచ తప్పకుండా అమలు చేయండి బాబూ అని జగన్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు చెప్పిన హామీలలో ఏ ఒక్కటి సవ్యంగా చేయకపోయినా తాను వెంటపడుతూనే ఉంటాను అని ఒక సందేశం అయితే జగన్ బలంగానే పంపించారు.