పెద్దాయన నా మీద రాళ్ళేయమంటున్నారు... జగన్ సంచలన ఆరోపణ !
చంద్రబాబు అనుభవం ఆయన చేసిన నిర్వాకం అన్నది 2014 నుంచి 2019 మధ్యలో ప్రజలు చూసారని అన్నారు
By: Tupaki Desk | 16 April 2024 3:45 PM GMTనా మీద పెద్దాయనకు కోపం పెరిగింది, నా పేరు తలచుకుంటూ మీటింగులలో హై బీపీతో ఆయన మాట్లాడుతున్నాడు అంటూ చంద్రబాబు మీద భీమవరం సభలో జగన్ మండిపడ్డారు. నా మీద రాళ్ళు చేయమంటున్నాడు నేను నాశనం కావాలని కోరుకుంటున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. నా మీద బాబుకు ఎందుకు కోపం అంటే ఆయన పాలనలో ఏమీ ప్రజలకు చేయలేదని నేను చెబుతున్నాను, ప్రజలకు గుర్తిండిపోయే ఒక్క పని అయినా చేశారా అని బాబుని అడుగుతూంటే ఇప్పటి దాకా జవాబు అయితే లేదు పైపెచ్చు నా మీద విమర్శలు చేస్తూ తిట్లూ శాపనార్ధాలతో విరుచుకుపడుతున్నారు అని బాబు మీద జగన్ ఫైర్ అయ్యారు.
చంద్రబాబు అనుభవం ఆయన చేసిన నిర్వాకం అన్నది 2014 నుంచి 2019 మధ్యలో ప్రజలు చూసారని అన్నారు. సింగపూర్ చేస్తాను లండన్ పారిస్ మలేషియా అంటూ బాబు గ్రాఫిక్స్ పాలన చేశారు తప్ప ఏపీని ఏమి బాగు చేశారు అని జగన్ ప్రశ్నించారు. బాబు ఆయనకు వంతపడే దత్తపుత్రుడు ఎల్లో మీడియా ఏపీ ఈ విధంగా ఉన్నందుకు బాధ్యత వహించాలని జగన్ అన్నారు.
తాను అయిదేళ్ళ కాలంలో లక్ష కోట్ల పెట్టుబడులు ఏపీకి తెచ్చానని పది పోర్టులు ఏపీలో నిర్మిస్తున్నామని అలాగే 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని భోగాపురం ఎయిర్ పోర్టుని నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతీ గ్రామాలో సచివాలయాలు నిర్మించి గ్రామాభివృద్ధికి బాటకు వేశామని జగన్ అన్నారు.
రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం జరుగుతోందని, అలాగే స్వయం ఉపాధి రంగాన్ని బలోపేతం చేస్తున్నామని జగన్ చెప్పారు. ఆసరా చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ వంటి పధకాల ద్వారా స్వయం ఉపాధి రంగాలకు పెద్ద పీట వేస్తున్నామని జగన్ చెప్పారు.
అదే విధంగా ఏపీలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసి పాలనను ప్రజల వద్దకు తెచ్చామని చెప్పారు. గ్రామాలలో 11 వేల రైతు భరోసా కేంద్రలను ఏర్పాటు చేశామని, అలాగే మూడు వేల డిజిటల్ లైబ్రరీలు నిర్మించామని అలాగే ఆసుపత్రులు విద్యాలయాలలో మార్పులు తెచ్చామని జగన్ చెప్పుకొచ్చారు.
మొత్తం మీద జగన్ ఈసారి తన పాలనలో సంక్షేమం తో పాటు అభివృద్ధి కూడా ఉందని భీమవరం సభలో చెప్పారు. వైసీపీ ఏలుబడిలో అభివృద్ధి లేదు అన్న విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దాంతో తాము చేసిన అభివృద్ధి ఏమిటి అన్నది వివరించే ప్రయత్నం చేశారు. అలాగే టీడీపీ హయాంలో అభివృద్ధి సంక్షేమం రెండూ లేవని ఆయన విమర్శించారు. అంతే కాదు, 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ ఎన్నికల ప్రణాళిక ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.