''జాబు రావాలంటే.. ఏ బాబు రావాలి.. మీరే తేల్చుకోండి''
ఈ క్రమంలో ఉమ్మడి గుంటూరులోని పల్నాడు జిల్లాలో ఉన్న పిడుగురాళ్ల నియోజకవర్గంలో పర్యటించారు.
By: Tupaki Desk | 10 April 2024 1:27 PM GMT''జాబు రావాలంటే.. ఏ బాబు రావాలి.. మీరే తేల్చుకోండి''- ఇది టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన అనుకుంటున్నారా? కాదు.. సాక్షాత్తూ సీఎం జగన్ చేసిన ప్రకటన. ప్రస్తుతం 'మేమంతా సిద్ధం' పేరుతో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి గుంటూరులోని పల్నాడు జిల్లాలో ఉన్న పిడుగురాళ్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తొలిసారి ఆయన ఉద్యోగాల విషయంపై మాట్లాడారు. ''జాబు రావాలంటే ఏ బాబు రావాలో మీరే నిర్ణయించుకోవాలి.. మీరే తేల్చుకోవాలి!'' అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జగన్ రెండు కీలక విషయాలు ప్రస్తావించారు. తన ఐదేళ్ల పాలన, చంద్రబాబు ఐదేళ్ల పాలనను ప్రస్తావిస్తూ.. ఉద్యోగాల భర్తీ సంఖ్యను ఏకరువు పెట్టారు. జగన్ పాలనలో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కీలకమైన వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చినట్టు తెలిపారు. దీనివల్ల ఒకవైపు వారు ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూనే మరోవైపు ప్రభుత్వానికి, ప్రజలకు సేవకులుగా రాణించారని తెలిపారు. ఇది వారికి నూతన ఉద్యోగాలు పొందేందుకు అవకాశం లభించిందన్నారు. వీరే రాష్ట్రంలో 2.66 లక్షల మంది ఉన్నారని చెప్పారు. వీరు కాకుండా 2.31 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
వీరిలో 1.36 వేల మంది సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్‌గా ఉన్నారని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వీరు పనిచేస్తున్నారని చెప్పారు. ఇక, వలంటీర్ల వ్యవహారం అందరికీ తెలిసిందేనని అన్నారు. అంటే.. పర్మినెంట్ ఉద్యోగాలు 2.31 లక్షల మందికి ఇస్తే.. వలంటీర్లను 2.66 లక్షల మందిని నియమించి.. వారికి ఇతోధికంగా సాయం చేశామన్నారు. అందుకే రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు. ఇక, చంద్రబాబు పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 32 వేలేనని జగన్ చెప్పారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనతో కలిపితే.. మొత్తం ఉద్యోగాలు 52 వేలేనని జగన్ తెలిపారు. దీనిని బట్టి ప్రజలు ఎవరు అధికారంలో ఉంటే.. మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయో తేల్చుకోవాలని జగన్ పిలుపునిచ్చారు.