ఏమి ఆ ధీమా?... ప్రభుత్వ ఏర్పాటుపై జగన్ సంచలన వ్యాఖ్యలు!
ఇప్పటికే సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తాలూ ఫిక్స్ చేసిన పరిస్థితి.
By: Tupaki Desk | 30 May 2024 12:43 PM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం జూన్ 4న వెలువడబోయే ఫలితాలపైనే అందరిదృష్టీ ఉందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 4న జరగబోయే కౌంటింగ్ కు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సమయంలో ఆయా రాజకీయ పార్టీలు.. ప్రధానంగా వైసీపీ గెలుపుపై పూర్తి ధీమాను కనబరుస్తున్నాయి. ఇప్పటికే సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తాలూ ఫిక్స్ చేసిన పరిస్థితి.
ఇందులో భాగంగా... పోలింగ్ ముగిసిన తర్వాత మూడు నాలుగు రోజులకు సీఎం వైఎస్ జగన్ ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లి ఎన్నికల ఫలితాలపై తనకున్న అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 2019లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువగానే ఈసారి సాధిస్తామని తెలిపారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్.. ఈ మేరకు పార్టీలోని కీలక నాయకులతో ఇదే విషయాన్ని పునరుధ్గాటించారని అంటున్నారు.
ఈ సమయంలో ఇవాళ మరోసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ తనదైన ధీమాతో స్పందించారు. గతంలో 2019లో గెలిచి ఇదే రోజున (మే 30) ప్రమాణస్వీకారం చేసిన జగన్.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఓ ట్వీట్ చేశారు. అప్పట్లో ప్రమాణ స్వీకారం చేసిన ఫొటోను ఆ ట్వీట్ కు జతచేశారు. ఈసారి రాబోయే ఫలితాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో అదే మరోసారి జరగబోతోందని జగన్ హింట్ ఇచ్చేశారు!
"దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది" అని జగన్ ట్వీట్ చేశారు.
దీంతో.. జగన్ ధీమా పీక్స్ అని అంటున్నారు పరిశీలకులు. తన పాలనపై తనకున్న ధీమా వేరే లెవెల్ అని చెబుతున్నారు. ఏదోలాగా ఎన్నికల్లో గెలవాలి అని.. నైతికత అనే మాటను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ పబ్బాలు గడుపుకునే నేతలు ఉన్నారని చెబుతున్న ఈ రోజుల్లో... తనవల్ల మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ పాజిటివ్ గా జనాల్లో వెళ్లిన జగన్... ఈ స్థాయిలో ధీమా ప్రదర్శించడంలో తప్పు లేదని చెబుతున్నారు.
కాగా... జూన్ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం ఉంటుందని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో... ఆ రోజుతోపాటు ఆరోజుకు ఒకరోజు ముందు, తర్వాత కూడా హోటల్ రూమ్స్ చాలా వరకూ అడ్వాన్స్ బుక్కింగ్ అయిపోయాయని చెబుతున్నారు. మరోపక్క జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలోని మెనూ కూడా ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. ఏది ఏమైనా... ఈ ధీమా మాత్రం పీక్స్ అనే చెప్పాలి!