Begin typing your search above and press return to search.

వైసీపీలో ఏమి జరుగుతోంది...జగన్ సంచలన నిర్ణయాలు ?

అయితే ఇది ఇక్కడితో సరిపోదని పూర్తిగా జిల్లా అధ్యక్షులతోనే కాకుండా ప్రతీ నియోజకవర్గం ఇంచార్జితో నేరుగా జగన్ అనుసంధానం అయితేనే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Aug 2024 6:55 AM GMT
వైసీపీలో ఏమి జరుగుతోంది...జగన్ సంచలన నిర్ణయాలు ?
X

వైసీపీలో సంచలన నిర్ణయాల దిశగా అధినేత వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. వైసీపీని జగన్ కొన్ని భాగాలుగా మార్చి ఒక్కో దానికి తనకు అనుకూలమైన వారిని నియమించి వారి ద్వారానే పార్టీ పాలన సాగినట్టు చూసారు. ఇలా చేస్తే పార్టీ పట్టు దొరుకుంతని ఆయన అనుకున్నారు.

ప్రతీ దానికీ అధినేత వద్దకు కాకుండా ఎక్కడికక్కడ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తూ ఆయన ప్రతీ మూడు జిల్లాలను ఒక రీజియన్ గా చేస్తూ వాటికి పార్టీ సీనియర్ నేతలను తన సన్నిహితులను రీజనల్ కో ఆర్డినేటర్లుగా నియమించారు. అలా ఉత్తరాంధ్రాకు వైవీ సుబ్బారెడ్డి గోదావరి జిల్లాలకు మిధున్ రెడ్డి,నెల్లూరు ప్రకాశం వంటి వాటికి విజయసాయిరెడ్డి, రాయల సీమ జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు నియమితులు అయ్యారు.

వీరు పార్టీ జిల్లా అధ్యక్ష్యులు ఇతర నేతలను కో ఆర్డినేట్ చేసుకుంటూ పార్టీని నడపాలి. కానీ జరిగింది వేరు. వర్గ పోరు ఇంకా అధికం అయింది కో ఆర్డినేటర్ల మాటలను ఎవరూ వినే పరిస్థితి కనిపించలేదు. అంతే కాదు అధినాయకత్వంతో టచ్ లేకుండా పోయింది. గ్యాప్ దారుణంగా పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాగా దెబ్బ తింది అన్న చర్చ కూడా సాగింది.

దాంతో జగన్ ఇవన్నీ ఆలోచించిన మీదట రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు ఉపక్రమించారు అని అంటున్నారు. పార్టీ వర్గాలలో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక ఇక మీదట వైసీపీలో ఈ వ్యవస్థ అన్నది కనిపించదు అని అంటున్నారు. నిజానికి టీడీపీ లో కానీ మరే పార్టీలో కానీ ఇలాంటి వ్యవస్థ ఏదీ కనిపించదు.

వైసీపీ మాత్రం కొత్త ఒరవడి అని భావించి దీనిని అమలు చేసి చేదు అనుభవాలను మూటకట్టుకుంది. మొత్తం మీద వైసీపీలో రీజనల్ కో ఆర్డినేటర్లు ఇక ఉండరు అని తేలుతున్న వాస్తవం. మరి ఏమి చేస్తారు పార్టీ కొత్త స్ట్రక్చర్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది కూడా చర్చకు వస్తోంది.

అయితే పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించి వారితో జగన్ మాత్రమే నేరుగా ఎప్పటికపుడు చర్చిస్తారు తద్వారా పార్టీకి అధినాయకత్వానికి మధ్య గ్యాప్ లేకుండా చూసుకుంటారు అని అంటున్నారు. అలా అయితేనే గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ అన్నీ పార్టీకి తెలుస్తాయని భావిస్తున్నారుట. ఒక విధంగా వైసీపీ చీకటి నుంచి వెలుగు చూసేందుకు ఒక కిటికీని తెరచింది అని అంటున్నారు.

అయితే ఇది ఇక్కడితో సరిపోదని పూర్తిగా జిల్లా అధ్యక్షులతోనే కాకుండా ప్రతీ నియోజకవర్గం ఇంచార్జితో నేరుగా జగన్ అనుసంధానం అయితేనే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. చంద్రబాబు ఇదే విధానం అనుసరిస్తున్నారు అని అంటున్నారు. బాబు ఎంత వీలు అయితే అంత దాకా గ్రౌండ్ లెవెల్ లో పార్టీ స్ట్రక్చర్ ని కలిసేందుకు ఇష్టపడతారు. దాని వల్ల ఎప్పటికప్పుడు విషయాలు అన్నీ తెలుస్తూ ఉంటాయని చెబుతున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీలో సభ్యత్వ నమోదు అన్నది కూడా చేయాలని అంటున్నారు. దాని ద్వారా పార్టీ పటిష్టం అవుతుందని క్యాడర్ లో కొత్త జోష్ వస్తుందని అంటున్నారు. అందుకే ముందుగా అడహాక్ కమిటీలని జిల్లా నియోజక స్థాయిలలో నియమించి పార్టీ సభ్యత్వం నమోదు చేసిన తరువాత బూత్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం చేసుకుంటూ వస్తేనే స్థానిక ఎన్నికల నాటికి వైసీపీ బలోపేతం అవుతుందని అంటున్నారు. జగన్ వరకూ చూస్తే నాయకుల కంటే క్యాడర్ నే నమ్ముకోవాలని భావిస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.