చంద్రబాబే మెచ్చుకున్నారు...జగన్ మార్క్ సెన్సేషన్ !
వాలంటీర్లకు పది వేల రూపాయల పారితోషికం ఇస్తామని బాబు అనడం అంటే ఇలాగైనా తన పాలన బాగుందని మెచ్చుకున్నారని జగన్ సెటైర్లు వేశారు
By: Tupaki Desk | 11 April 2024 1:30 AM GMTఏపీలో అయిదేళ్ల వైసీపీ పాలనను చంద్రబాబే మెచ్చుకున్నారు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన పిడుగురాళ్ళ సభలో మాట్లాడుతూ బాబు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని అంటున్నారు అంటే తమ పాలనను బాగుంది అన్నట్లే అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వాలంటీర్లకు పది వేల రూపాయల పారితోషికం ఇస్తామని బాబు అనడం అంటే ఇలాగైనా తన పాలన బాగుందని మెచ్చుకున్నారని జగన్ సెటైర్లు వేశారు
నా పాలనకు బాబు ఇచ్చే సర్టిఫికేట్ ఇంతకంటే ఏముంటుందని ఆయన అన్నారు. వాలంటీర్ల మీద విషం చిమ్మిన చంద్రబాబు ప్రజలు తిరుగుబాటు దెబ్బకు రివర్స్ అయ్యారని జగన్ ఎద్దేవా చేశారు. వాలంటీర్ల వ్యవస్థను చూస్తే చాలు చంద్రబాబు గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయ్ని ఆయన అన్నారు.
చంద్రబాబు పాలనలో ఎపుడైనా వాలంటీర్ల వ్యవస్థ లాంటి ఆలోచన చేశారా అని జగన్ ప్రశ్నించారు. తాము పాలనలో సంస్కరణలు తీసుకుని వచ్చామని అన్ని వర్గాలకు మేలు చేశామని జగన్ చెప్పారు. ప్రజలకు వైసీపీ మేలు చేసింది కాబట్టే వారు వైసీపీని ఆదరిస్తున్నారు అని జగన్ అన్నారు.
గత అయిదేళ్ల బాబు పాలనలో వాలంటీర్లను ముందు పెట్టి అన్ని విధాలుగా దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. బాబు కంటే ఊసరవెల్లి నయం అని దెప్పిపొడిచారు. వృద్ధుల పెన్షన్ ఆపడానికి ఆయన కుటిల వ్యూహాలు పన్నారని ప్రతీ నెలా ఇంటికి వచ్చే పెన్షన్ ఆగిపోయిందని జగన్ గుర్తు చేశారు.
బాబుని ఒక వర్గం మీడియా నెత్తిన పెట్టుకుని మోస్తోందని ఆయన ఏమీ చేయకపోయినా అంతా బాగా చేస్తున్నారు అని దారుణమైన ప్రచారం చేస్తోందని జగన్ విమర్శించారు. గాడిదను చూపించి గుర్రం అని ప్రచారం చేయడం కూడా టీడీపీ అనుకూల మీడియాకే సాధ్యమని జగన్ ఎద్దేవా చేశారు.
బాబు 2014 నుంచి 2019 దాకా విభజన ఏపీలో ఒక్క వర్గానికైనా న్యాయం చేశారా అని జగన్ ప్రశ్నించారు. ఆయన మొత్తం అయిదేళ్లలో ఇచ్చినది కేవలం 32 వేల ఉద్యోగాలేనని జగన్ విమర్శించారు. అదే సమయంలో వైసీపీ భర్తీ భర్తీ చేసిన ఉద్యోగాలు రెండు లక్షల 31 వేల ఉద్యోగాలు అని జగన్ వివరించారు.మరి జాబు రావాలి అంటే అధికారంలోకి రావాల్సింది ఎవరు అన్నది ప్రజలే ఆలోచించాలని జగన్ కోరారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క వైద్య రంగంలోనే 54 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని వెల్లడించారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షా 35 వేలమందికి ఉద్యోగాలు కల్పించామని జగన్ వివరించారు. ఏపీలో అభివృద్ధి చేయమంటే దోచుకో దాచుకో తినుకో అన్న విధానాన్ని అమలు చేసిన తుప్పు పట్టిన సైకిల్ కావాలా లేక ఫ్యాన్ కావాలా అని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు ఎన్నికల ముందు గంగలా ఉంటారని, ఎన్నికలు అయిపోయాక అధికారం చేతిలో పడితే చంద్రముఖిగా మారడం ఖాయమని జగన్ అన్నారు. పొరపాటున ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ పధకాలు అన్నీ ఎత్తేస్తారు అని హెచ్చారించారు.
వైసీపీ పేదల పార్టీ అని పెత్తందారుల మీద పోరాడుతున్న పార్టీ అని అన్నారు. పేదలు బాగుపడాలీ అంటే వైసీపీ పాలన మరోసారి ఏపీలో రావాల్సిందే అని జగన్ స్పష్టం చేశారు. తనకు బాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావాలని పేదలకు చంద్రబాబుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో పేదలు అంతా వైసీపీ పక్షం వహించాలని ఆయన కోరారు.