Begin typing your search above and press return to search.

జగన్ సూటి వార్నింగ్.. రేపు మీ వాళ్లకు ఇదే గతి!

ఇలా భయాందోళన కల్పిస్తే ప్రయోజనం ఉందని భావిస్తున్నారు. కానీ.. చంద్రబాబు దయచేసి ఈ చెడు సంప్రదాయాన్ని తప్పకుండా ఆపేయండి.

By:  Tupaki Desk   |   7 July 2024 7:28 AM GMT
జగన్ సూటి వార్నింగ్.. రేపు మీ వాళ్లకు ఇదే గతి!
X

మనమేం ఇస్తే అదే తిరిగి వస్తుందన్న విషయాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్లున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయనో కీలక వ్యాఖ్య చేశారు. ఆర్నెల్ల వ్యవధిలో తన పాలనతో శత్రువులు సైతం స్నేహితులైపోతారంటూ సినిమాటిక్ మాట చెప్పారు. మాట చెప్పటమైతే చేశారు కానీ ఆ తర్వాత చేతల్లో ఏం జరిగిందో అందరికి తెలిసిందే. గడిచిన ఐదేళ్లలో వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా.. టీడీపీకి చెందిన కీలక నేతలు జైలుపాలు కావటం లేదంటే జైలు భయంతో ఉక్కిరిబిక్కిరి కావటం తెలిసిందే. చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం జైల్లో గడపాల్సిన దుస్థితి.

ఇక.. ఊళ్లల్లో వైసీపీ కార్యకర్తలు సైతం ఎంతలా చెలరేగిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి.. ఓట్లు ఆటోమేటిక్ గా పడిపోతాయన్న భ్రమలో ఉన్న జగన్.. తన ఐదేళ్ల పాలనను పథకాల చుట్టూ.. బటన్లు నొక్కుడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం తెలిసిందే. ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాలు ఆయనకు ఎంతటి షాక్ ను గురి చేశాయో జగన్ మాటల్ని వినే అందరికి అర్థమవుతుంది.

అధికార బదిలీ నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం.. ఐదేళ్ల జగన్ పాలన వేళ.. టీడీపీకి చెందిన వారిని.. సానుభూతిపరుల్ని విపరీతమైన వేధింపులకు గురి చేయటం.. ఓడిన తర్వాత కూడా తమ తీరును మార్చుకోకపోవటం లాంటి కారణాలతో గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరి అత్యుత్సాహం దాడుల ఘటనలుగా నమోదవుతున్నాయి. ఏం జరిగినా.. వైసీపీ సర్కారులో చోటు చేసుకున్న పరిణామాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ ఘటనలు నమోదు అవుతున్నట్లు చెబుతున్నారు.

ఇటీవల వెంపల్లిలో ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డి రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వెళ్లిన జగన్.. సదరు కార్యకర్తను పరామర్శించి.. భయపడాల్సిన అవసరం లేదని.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. పాతికేళ్ల అజయ్ కుమార్ రెడ్డిని టీడీపీ శ్రేణులు దారుణంగా కొట్టాయని చెబుతూ.. "ఇప్పుడు మీరు వేస్తున్న బీజం.. చేసే పనులు.. రేపొద్దున టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది.

ఇలా భయాందోళన కల్పిస్తే ప్రయోజనం ఉందని భావిస్తున్నారు. కానీ.. చంద్రబాబు దయచేసి ఈ చెడు సంప్రదాయాన్ని తప్పకుండా ఆపేయండి. ఎప్పటికీ మీరే అధికారంలో ఉండరు.

శిశుపాలుడి పాపాల్లా పెరిగిపోతున్నాయి. వీటిని గమనిస్తున్న ప్రజలు.. ఇప్పుడు దెబ్బ తిన్న వారు రేపు అటువైపు ఇలాంటి దాడులు చేయటానికి చంద్రబాబు బీజం వేస్తున్నారు. నాయకులుగా మేం ఇలాంటి చర్యలకు దిగకూడదు. వీటిని ఇక్కడితో ఆపేయాలి. లేకుంటే భవిష్యత్తు టీడీపీ శ్రేణులపై దాడులకు ఇవి ప్రేరేపిస్తాయి" అంటూ వ్యాఖ్యల రూపంలో వార్నింగ్ ఇచ్చేశారు.

వైసీపీకి ఓటు వేశాడన్న ఉద్దేశంతో అతడి బైక్ ను అడ్డుకొని మరీ దాడికి పాల్పడినట్లుగా జగన్ ఆరోరపించారు. వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కనిపిస్తే ఇలానే దాడులు చేస్తారా? అంటూ ప్రశ్నించిన ఘన్.. ఇలా దాడులు చేసి అమాయకులపై నిర్దాక్షిణ్యంగా కొట్టి ఆసుపత్రి పాలు చేస్తే మీకు కలిగే ప్రయోజనం ఏముంది? ఏం సాధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. తాను మాట్లాడే ప్రతి మాటలోనూ ప్రత్యర్థులపై నింద వేస్తున్న జగన్.. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రతి చోట ఇలాంటివి వందల సంఖ్యలో జరిగిన వైనాన్ని.. తాను అప్పుడు తన వర్గాన్ని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.

చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు అమాయకంగా జగన్ మాట్లాడుతున్న మాటల్ని ఎవరూ నమ్మరన్నమాట వినిపిస్తోంది. ఏమైనా.. హింసాత్మక ఘటనలతో కాకుండా.. డెవలప్ మెంట్ తో ఏపీ మరింత ముందుకు వెళ్లేలా టీడీపీ నేతలు.. కార్యకర్తలు ప్రయత్నించాలి. అప్పుడే అధికారం మరింత కాలం వారి చేతుల్లోనే ఉంటుందన్న సత్యాన్ని గ్రహించాలి. దాడులకు.. ప్రతీకారాలకు పోవటం ద్వారా భవిష్యత్తును మరింత హింసాత్మకంగా మార్చుకోవటంతో పాటు.. ఏపీ రాజకీయాలన్ని కక్షపూరితంగా మారాయన్న అపవాదును మూటకట్టుకోవాల్సి ఉంటుంది.