Begin typing your search above and press return to search.

బైరెడ్డి మాటే చెల్లుబాటు.. అయితే అభ్యర్థి ఆయన చెప్పిన వ్యక్తి కాదు!

తాజాగా నాలుగో విడతలో 8 అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌ సభా స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు.

By:  Tupaki Desk   |   19 Jan 2024 6:42 AM GMT
బైరెడ్డి మాటే చెల్లుబాటు.. అయితే అభ్యర్థి ఆయన చెప్పిన వ్యక్తి కాదు!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేస్తున్న మార్పులుచేర్పులు ఆ పార్టీలో కలకలానికి దారితీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు విడతల్లో 58 అసెంబ్లీ స్థానాలకు, 11 లోక్‌ సభా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

తాజాగా నాలుగో విడతలో 8 అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌ సభా స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూరు స్థానానికి డాక్టర్‌ దారా సుధీర్‌ ను అభ్యర్థిగా నిర్ణయించారు. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తొగురు ఆర్థర్‌ కు జగన్‌ సీటు నిరాకరించారు.

నందికొట్కూరుకు ఇప్పటివరకు తొగురు ఆర్థర్‌ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ తరఫున పార్టీ ఇంచార్జి మాత్రం.. వైసీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డే కావడం గమనార్హం. ఇన్నాళ్లూ నియోజకవర్గంలో చక్రం తిప్పింది కూడా ఆయనేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో తొగురు ఆర్థర్‌ పలు పర్యాయాలు వైసీపీ అధిష్టానానికి బైరెడ్డిపై ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వైసీపీ అధిష్టానం బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డికే పెద్దపీట వేసింది.

తాజాగా అసెంబ్లీ అభ్యర్థి ప్రకటనలోనూ బైరెడ్డి సిద్థార్థ్‌ రెడ్డి చెప్పినట్టే జగన్‌ చేశారని అంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ వద్దని.. ఈ సీటును మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి కేటాయించాలని బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో తొగురు ఆర్థర్‌ ను పక్కనపెట్టిన జగన్‌ కొత్త అభ్యర్థి దారా సుధీర్‌ ను అభ్యర్థిగా ప్రకటించారు.

వైసీపీ అధిష్టానానికి సన్నిహితుడైన షిర్డీ సాయి ఎలక్ట్రికల్‌ యజమాని సూచించడం వల్లే దారా సుధీర్‌ కు అభ్యర్థిత్వం దక్కిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులోనూ దారా సుధీర్‌ కూడా వైఎస్సార్‌ జిల్లాకు చెందిన వ్యక్తే కావడం గమనార్హం. ఆయనను వైఎస్సార్‌ జిల్లా నుంచి పట్టుకొచ్చి కర్నూలు జిల్లా నందికొట్కూరు అభ్యర్థిగా ప్రకటించడం విశేషం.

ఇటీవల ఈ విషయంపై నందికొట్కూరు పార్టీ ఇంచార్జిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డితో జగన్‌ చర్చించారని తెలుస్తోంది. నందికొట్కూరుకు ప్రస్తుత ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ తో కలిసి ముగ్గురు అభ్యర్థులను పరిశీలిస్తున్నామని జగన్‌ చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తొగురు ఆర్థర్‌ వద్దని బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి చెప్పారని టాక్‌. మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి సీటు ఇవ్వాలని బైరెడ్డి కోరారని అంటున్నారు. అయితే జగన్‌.. బైరెడ్డి చెప్పినట్టు తొగురు ఆర్థర్‌ ను తప్పించినా ఆయన చెప్పిన వెంకటస్వామికి మాత్రం సీటు ఇవ్వలేదు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ యాజమాన్యం సూచించిన డాక్టర్‌ దారా సుధీర్‌ కు సీటిచ్చి బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డికి షాకిచ్చారని అంటున్నారు.