బస్సు యాత్ర పూర్తి.. జగన్ అమ్ముల పొదిలో 'జనం' అస్త్రాలు!
ఇప్పటి వరకు 15 భారీ బహిరంగ సభల్లో జగన్ పాల్గొని ప్రసంగించారు.
By: Tupaki Desk | 24 April 2024 8:00 AM GMTఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' ఎన్నికల ప్రచార బస్సు యా త్ర బుధవారంతో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత.. మార్చి 27న ప్రారంభించిన ఈ బస్సు యాత్ర ఒకటి రెండు రోజులు మినహా.. 21(బుధవారంతో 22 రోజులు) రోజులు నిరంతరాయంగా ముందుకు సాగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేసింది. చివరిరోజు శ్రీకాకుళం, విజయనగరంలో కూడా పర్యటించి.. తిరుగు ప్రయాణలో టెక్కలిలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో వైనాట్ 175 నినాదాన్ని వినిపిస్తున్న సీఎం జగన్.. ఆదిశగా పార్టీ నాయకులకు దన్నుగా మారేందుకు.. ప్రజల నాడి తెలుసుకునేందుకు.. ఈ బస్సు యాత్ర చేపట్టారు. ఉమ్మడి జిల్లాల్లోని 12 చోట్ల ఈ యాత్ర సాగింది. ఇప్పటి వరకు 15 భారీ బహిరంగ సభల్లో జగన్ పాల్గొని ప్రసంగించారు. ఇక, మహిళా సంఘాలు, విద్యార్థులు, కార్మికులు, డ్రైవర్లు, మునిసిపల్ సిబ్బంది, న్యాయవాదులు.. ఇలా.. వివిధ వర్గాలతో 22 అంతర్గత సమావేశాలు నిర్వహించారు.
మొత్తానికి సార్వత్రిక ఎన్నికల సమరంలో.. మొత్తం మూడు దశలుగా పర్యటనలు, ప్రసంగాలు చేయాలని నిర్ణయించుకున్న సీఎం జగన్.. ఇప్పటికి రెండు దశల్లో కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. తొలి దశలో సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. ఇవి ఐదు సాగాయి. తర్వాత.. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రులు చేపట్టారు. ఇక, మూడో దశలో జిల్లాల్లో ఆయన హెలికాప్టర్ల ద్వారా సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. అప్పటికి మే 10 వ తేదీ వచ్చేయనుంది. 13న ఎన్నికలు జరగనున్నాయి.
మెరుపులు-మరకలు!
జగన్ చేపట్టిన 22 రోజుల బస్సు యాత్రలో కొన్ని మెరుపులు ఉండగా.. మరికొన్ని మరకలు కూడా పడ్డాయి. వీటిలో జనసేనకు చెందిన కీలక నాయకులు.. జిల్లా ఇంచార్జ్‌లు.. బాధ్యులు.. జగన్ సమక్షంలో పార్టీ మారారు. కడప, కర్నూలు జిల్లాల్లో జగన్ కోసం.. రైతులు ఎదురేగి వచ్చి... 1000 ఎడ్ల బండ్లతో స్వాగతం పలికారు. ఇక, విశాఖ, విజయవాడల్లో విద్యార్థులు వచ్చి.. జగన్ మాస్క్‌లు పెట్టుకుని హల్చల్ చేశారు. మరకల విషయానికి వస్తే.. కర్నూలు జిల్లాలో పర్యటించినప్పుడు.. ఆగంతకుడు ఒకరు చెప్పులు విసిరారు. అవిసీఎంజగన్‌కు తృటిలో తప్పాయి. అదేవిధంగా విజయవాడలోని శివారు ప్రాంతం సింగ్‌నగర్‌లో సతీష్(పోలీసులు చెప్పినమేరకు) అనే మైనర్.. రాయి విసిరాడు. దీంతో జగన్‌తలకు గాయమైంది.